ఏకతాటిపైకి రాకుంటే.. మానవ సంక్షోభం తప్పదు - ఐక్యరాజ్య సమితి

By Newsmeter.Network  Published on  1 April 2020 5:26 AM GMT
ఏకతాటిపైకి రాకుంటే.. మానవ సంక్షోభం తప్పదు - ఐక్యరాజ్య సమితి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్‌ భారినపడి 41వేల మందికిపైగా మృతి చెందగా.. 8.30లక్షల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా 'సామాజికార్థిక పరిస్థితులపై కరోనా వైరస్‌ ప్రభావం'పై ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి మాంద్యాన్ని ఎప్పుడూ చూసి ఉండి ఉండమని అంచనా వేశారు. రానున్న రోజుల్లో ప్రపంచం అత్యంత సవాల్‌తో కూడుకున్న సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read :ఏపీలో కలకలం.. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కరోనా పాజిటివ్‌ కేసులు

ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌పై పోరును ప్రపంచ దేశాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. రాజకీయ పంతాలకు పక్కనబెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటికిపైకి వస్తేనే ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన సూచించారు. ఐరాస 75ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదిక అభిప్రాయ పడిందని, ఇది కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్ని ఖాతరు చేయడం లేదని, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నామని గుటెరస్‌ స్పష్టం చేశారు.

Also Read :తెలంగాణలో మద్యం షాపులు అప్ప‌టివ‌ర‌కూ బంద్.. ఉత్తర్వులు జారీ

ఇదిలాఉంటే కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికానుసైతం కరోనా వైరస్‌ అతలాకుతలం చేసింది. బ్రిటన్‌, ఇటలీ వంటి దేశాలుసైతం ఈ కరోనా దెబ్బకు కుదేలైయ్యాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నా.. లాక్‌డౌన్‌ ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Next Story