హైదరాబాదీ పిల్లోడు.. లెక్కల్లో దూకుడు..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 Aug 2020 12:53 PM IST
హైదరాబాదీ పిల్లోడు.. లెక్కల్లో దూకుడు..!

నీలకంఠన్‌ భానూ ప్రకాష్‌.. రెండు పదుల వయసులో రికార్డులు సృష్టిస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడు.. మానవ కంప్యూటర్‌గా పెరు తెచ్చుకున్నాడు. ఎలాంటి లెక్కలయినా.. చిక్కులెన్ని వేసిచ్చినా చిటికెలా చెబుతూ ఔరా అనిపిస్తున్నాడు. మానవ కంప్యూటర్‌గా ప్రసిద్ధి కెక్కిన శకుంతలా దేవిని తలపిస్తున్నాడు. అతి వేగంగా లెక్కలు చెప్పే యువకుడిగా ప్రకాష్‌ మైండ్‌ స్పోర్ట్‌ ఒలంపియాడ్‌లో మెంటల్‌ కాలిక్యులేషన్‌లో ప్రపంచ ఛాంపియన్‌ సాధించి భారత్‌కు బంగారు పతకాన్ని తెచ్చాడు. శకుంతలా దేవి తర్వాత అంతస్థాయిలో భాను ప్రకాష్‌ మానవ కంప్యూటర్‌ అన్న పేరు తెచ్చుకున్నాడు.

శకుంతలాదేవి బాటలో నడుస్తూ ప్రకాష్‌ లెక్కల్లో లెక్కకు మిక్కిలి అవార్డులు కైవసం చేసుకున్నాడు. దాదాపు 50 లిమ్కా అవార్డుల్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. మైండ్‌ స్పోర్ట్‌ ఒలంపియాడ్‌ ప్రపంచఖ్యాతి గడించిన అంతర్జాతీయ మేధా క్రీడ. 1998 నుంచి ఏటా లండన్‌లో మేధస్సుకు సంబంధించిన పలు గేమ్‌లను మైండ్‌ స్పోర్ట్‌ ఒలంపియాడ్‌ కింద నిర్వహిస్తారు. ఈ ఏడు ఆగస్టు 15 అంటే మన స్వాతంత్య్ర దినోత్సవం నాడు లండన్‌లో ఈ ఒలంపియాడ్‌ను నిర్వహించారు. అప్పుడే ప్రకాష్‌ భారత్‌ ఖ్యాతిని త్రివర్ణ పతాకంలా విశ్వం ముంగిట ఎగరవేశాడు.

గతంలో గణిత మేధావులు స్కాట్‌ ఫ్లాన్స్‌బర్గ్, శకుంతలాదేవి లాంటి ప్రముఖుల్లా రికార్డులు సృష్టించడం, రికార్డులు బద్దలు కొట్టడం అంటే మన దేశ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో మరింత ఉన్నతంగ నిలపడమే అని ప్రకాష్‌ అంటాడు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో ప్రకాష్‌ మ్యాథ్స్‌ హానర్స్‌ చేశాడు. కరోనా నేపథ్యంలో ప్రత్యక్షంగా కాకుండా ఈసారి చాంపియన్‌షిప్‌ పోటీలు వర్చువల్‌గా నిర్వహించారు. లేదంటే మన ప్రకాష్‌ లండన్‌లోనే మన విజయఢంకా మోగించేవాడు. ఈ పోటీలో యూకే, జర్మనీచ యూఏఈ, ఫ్రాన్స్, గ్రీస్, లెబాన్‌ లాంటి 13 దేశాల నుంచి 30 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో 57 ఏళ్ళ వయసున్నవారు కూడా ఉన్నారు. భానుప్రకాష్‌ ఈ పోటీలో 65 పాయింట్లతో తిరుగులేని విజయం సాధించాడు. లెబనీస్‌కు చెంఇన ప్రత్యర్థి రెండో స్థానంలో, యూఏఈ కు చెంఇన పోటీదారుడు మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో భానుప్రకాష్‌ మెరుపు వేగం చూసి న్యాయనిర్ణేతలు అబ్బురపడ్డారు.

‘నా వేగాన్ని చూసి న్యాయనిర్ణేతలు ఆశ్చర్యపోయారు. వారికి నమ్మకం కుదిరేందుకు నాకు అదనంగా మరికొన్ని లెక్కలిచ్చి చేయమన్నారు. ఈ పోటీలో తిరుగులేని విజయం సాధించగలిగాను’ అంటూ ప్రకాష్‌ ఆత్మవిశ్వాసంతో తెలిపాడు. ఈ సందర్భంగా ప్రకాష్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో విజన్‌ మ్యాథ్‌ పేరిట ప్రయోగశాలలు ప్రారంభించాలని ఉందని తెలిపారు. ఈ ల్యాబ్‌ల ద్వారా కోట్లాది మంది భారతీయ పిల్లలకు లెక్కల్లో ఆసక్తి కలిగించాలన్నది తన కోరికగా వివరించాడు.

ప్రకాష్‌కు లెక్కలపై ఆసక్తి మొదలైన ఘటన చాలా ఆసక్తికరం. చిన్నప్పుడు తన అయిదో ఏట ప్రమాదానికి గురై కొంత కాలం ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయంలోనే లెక్కలపై ఆసక్తి బీజం పడింది. భాను ప్రకాష్‌ చిన్నప్పటి నుంచే అబాకస్‌ పోటీల్లో పాల్గొనే వాడు. దాదాపు 9 లెవల్‌ పూర్తి చేశాడు. మూడుసార్లు ఎన్‌ఐపీ అకాడెమీ నిర్వహించే అబాకస్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నాడు. చిన్నప్పుడు బీజప్రాయంగా మొదలైన ఆసక్తి క్రమంగా పెద్దదై నేడు విజయఫలాలు ఇస్తోంది.

గ్రామీణ విద్యార్థుల్లో చాలా మందికి లెక్కలంటే ఓ రకమైన ఫోబియా ఉంది. సర్కారు స్కూళ్ళలో చదువుకునే విద్యార్థుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురికి లెక్కలంటే భయం. వారికి లెక్కల్లో ప్రాథమికస్థాయిగా ఉన్న అర్థమెటిక్‌ అర్థం కావడం లేదు. వారిని ఈ పరిస్థితి నుంచి బైట పడేయాలంటే.. మ్యాథ్స్‌ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళాలి. పల్లెపల్లెల్లో లెక్కలు సులువుగా నేర్పే విధానం అమలు కావాలి. అందుకే ఈ విజన్‌ ల్యాబ్‌లను ప్రారంభించాలనుకుంటున్నా అంటూ ప్రకాష్‌ భావోద్వేగంగా తెలిపాడు.

భారత్‌లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలు విశ్వవ్యాప్తంగా ఎదగాలంటే సంఖ్యాశాస్త్ర ప్రావీణ్యత అత్యవసరం. మన దేశంలో అక్షరాస్యతకు సంబంధించి ప్రభుత్వ పరంగా బోల్డెన్ని కార్యక్రమాలున్నాయి. అయితే సంఖ్యా పరిజ్ఞానానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటి దాకా రూపుదిద్దుకోలేదు. అంకెలన్నా సంఖ్యలన్నా భయం లేని తరం రావాలి. మనం సంఖ్యా పరిజ్ఞానం ఎంత పెంచుకుంటే ప్రపంచదేశాల్లో అంత ముందుంటాం. ప్రగతి కొంక్షతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంగా చొరవ తీసుకుంటే బావుంటుంది. దేశంలో ప్రతి మూలకు ఈ విజనరీ ల్యాబ్‌లు విస్తరించేందుకు సర్కారు పూనుకోవాలని ప్రకాష్‌ తన ఆశల్ని ఆకాంక్షల్ని వ్యక్తం చేస్తున్నాడు.

ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిని పరిజ్ఞానం మనది. ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో గణితశాస్త్రానికి పెద్దపీట వేశారు. అంతెందుకు మన తెలుగులోనే గణితంలో పద్యాలు రాసిన పావులూరి మల్లన ఉన్నాడు. కొంతమంది అష్టావధానాల్లా.. సంగీతావధానాల్లా.. గణితావధానాలు చేస్తున్నారు. అలాంటి వారి సంఖ్య పెరగాలి. పిల్లలో చిన్ననాటి నుంచే లెక్కలపై ఆసక్తి పెంచాలి. పూర్వంలో స్కూళ్ళలో చెబుతున్నట్టుగా నోటి లెక్కల సంప్రదాయం మళ్ళీ పునరుద్ధరించాలి. అప్పుడే భానుప్రకాష్‌ చెబుతున్న ఆశయం సిద్ధిస్తుంది.

Next Story