కోవిడ్ -19 మృతులు..ఒక్కరోజే 242 మంది..
By రాణి Published on 13 Feb 2020 9:47 AM GMTకోవిడ్ -19 ధాటికి చైనా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం ఒక్కరోజే హుబెయ్ ప్రావిన్స్ లో 242 మందిని కోవిడ్ 19 పొట్టనబెట్టుకుంది. మరో 14,840 మందికి కోవిడ్ 19 ఉన్నట్లుగా తేలింది. బుధవారం మరణించిన వారితో కలిపి..ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి 1355 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు అవలంబిస్తున్న పద్ధతిని విస్తృతం చేయడం వల్ల మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని హుబెయ్ ప్రావిన్స్ అధికారులు పేర్కొన్నారు.
వైరస్ కనిపెట్టడంలో చైనా వైద్యులు కొత్త విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటి వరకూ కోవిడ్ 19 సోకిన వారిని గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ చేసి..అందులో పాజిటివ్ వస్తేన్ వైరస్ సోకినట్లు నిర్థారించేవారు. అంతే తప్ప వైరస్ లక్షణాలున్నవారిని ఆ లిస్టులో చేర్చేవారు కాదు. కానీ ఇప్పుడు వైరస్ సోకినట్లు ఏ మాత్రం లక్షణాలు బయటపడినా..వారిని కూడా కోవిడ్ 19 బాధితులుగానే పరిగణించనున్నారు. అంటే వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ రాకుండా వైరస్ సోకిన లక్షణాలతో మరణించిన వారిని కూడా కోవిడ్ 19 మరణాల కిందే లెక్కేయనున్నారు. ఈ పద్ధతి బుధవారం నుంచి అమలులోకి రావడంతో బుధవారం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.