ఆర్థిక మాంద్యం నుంచి  బయటపడటానికి మార్గలేంటీ..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 12:25 PM GMT
ఆర్థిక మాంద్యం నుంచి  బయటపడటానికి మార్గలేంటీ..?

నిజంగానే భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందా...? ఇది ఆర్థికమాంద్యమా...? లేక.. ఆర్థిక మందగమనమా..? ఈ సమస్య నుంచి బయటపడడాని కి ప్రభుత్వం ఏం చేయాలి..? ఆర్థికవేత్తలు, నిపుణులు, విశ్లేషకుల సూచనలేంటీ..

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి 5శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 8 శాతం ఉంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో చూస్తే జీడీపీ రేటు 5.8 శాతం ఉంది. ఇది గత 25 త్రైమాసికాల్లోనే అత్యంత తక్కువ వృద్ధి. మోదీ పాలనాకాలంలో అతి తక్కువ వృద్ధి ఇదే. మొత్తమ్మీద గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు ఏకంగా 3 శాతం పడిపోయింది. ఆర్థికాభివృద్ధి వేగం మందిగించిందని చెప్పడానికి గణాంకాలే నిదర్శనమనే వాదనలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా ఇలాగే జరుగుతోందని, చాల రంగాల్లో అభివృద్ధి రేటు అతి తక్కువ స్థాయికి చేరుకుందని విశ్లేషిస్తున్నారు. ఐతే, ఇది ఆర్థికమాంద్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండు త్రైమాసికాలు ప్రతికూల వృద్ధి ఉంటే దానిని మాంద్యంగా పేర్కొంటారు. ప్రస్తుతానికి, మనదేశంలో ఈ పరిస్థితి రాలేదని ముంబైకి చెందిన ఆర్థిక నిపుణుడు వివేక్ కాల్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం వచ్చింది కానీ, నెగెటివ్ గ్రోత్ రాలేదని ఆయన విశ్లేషిస్తున్నారు. వృద్ధి వేగం నెమ్మదించడానికి చాలా కారణాలు ఉన్నాయన్న ఆయన, అంతర్జాతీయ మందగమనం పెద్ద కారణమని అభిప్రాయపడ్డా రు.

ఆర్దిక మాంద్యాన్ని నిర్వచించడం కష్టమా?

వాస్తవానికి ఆర్థికమాంద్యాన్ని నిర్వచించడం చాలా కష్టం. దీనిపై ఆర్థికవేత్తలు, నిపుణులు, విశ్లేషకుల్లోనే ఏకాభిప్రాయం లేదు. సాంకేతికంగా భారత ఆర్థికవ్యవస్థ వరుసగా రెండో త్రైమాసికంలో మందగమనంతో ముందుకెళ్తోంది. అంటే ఆరు నెలలుగా అభివృద్ధి వేగంలో తగ్గుదల నమోదైంది. ఇవి మాంద్యం సూచికలు. ఐతే, ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరిగితే, అప్పుడు మాంద్యం ప్రభావం ఉండదు. వరుసగా రెండు త్రైమాసికాలు క్షీణించినా, మిగ తా రెండు త్రైమాసికాల్లో పుంజుకునే అవకాశాలుంటాయి. అందుకే, పశ్చిమ దేశాల్లో తాజా పరిస్థితిని తేలికపాటి మాంద్యంగా చెబుతున్నారు. వరుసగా కొన్నేళ్లు ఆర్థిక వృద్ధి పూర్తిగా పతనమైతే అప్పుడు దానిని తీవ్ర మాంద్యంగా పేర్కొంటారు.

ఆర్థిక మందగమనం కంటే ఆర్థికమాంద్యం భయంకరమైనదా..?

ఆర్థిక మందగమనం కంటే ఆర్థికమాంద్యం భయంకరమైంది. డిప్రెషన్ అంటే ప్రతికూల వృద్ధి. సంవత్సరాల పాటు నెగెటివ్ వృద్ధి రేటు నమోదవడమే డిప్రెషన్. అమెరికా ఆర్థికవ్యవస్థ 1930వ దశకంలో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. దానినే డిప్రెషన్‌గా పేర్కొంటారు. డిప్రెషన్‌ పీరియడ్‌లో ధరలు అమాంతం పెరిగిపోతాయి. నిరుద్యోగం, పేదరికం తీవ్ర స్థాయికి చేరుతాయి. ఆర్థికవ్యవస్థ మానసిక మాంద్యానికి కూడా గురికావొ చ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుడు కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడమే మానసిక మాంద్యం. ఫలితంగా డిమాండ్ తగ్గి ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతుంది.

భారత ఆర్ధిక వ్యవస్థకు 1991లో భారీ కుదుపు

భారత ఆర్థికవ్యవస్థలో అతిపెద్ద సంక్షోభం 1991లో వచ్చింది. అప్పుడు దేశ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి 28 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇప్పుడు ఆ మొత్తం 491 బిలియన్ డాలర్లు. 2008-09లో ప్రపంచ మాంద్యం వచ్చింది. ఆ సమయంలో భారత ఆర్థికవ్యవస్థ 3.1 శాతం వృద్ధి రేటుతో ముందుకు నడిచింది. ఆ తర్వాత మళ్లీ కోలుకొని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రశంసలు పొందింది. ఇప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా మార్గాలున్నాయ ని నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడమే ఇందుకు కారణం. మోదీ సర్కారు కూడా పలు ఉద్దీపన చర్యలు ప్రకటించింది. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు, జీఎస్టీ శ్లాబ్‌లలో సవరణలు, బ్యాంకులకు మూలధన సాయం పెంపుతో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోం ది. ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో కొనుగోళ్లు పెరుగుతాయని ఆశిస్తోంది. వర్షాలు సమృద్ధిగా పడడం, పంటల దిగుబడి పెరిగే అవకాశాలుండడంతో వచ్చే త్రైమాసికాల్లో వృద్ధి రేటు మళ్లీ పుంజుకుంటుందని గంపెడశాలు పెట్టుకుంది.

Next Story