హైదరాబాద్‌లో కరోనా ఎలా ఉందో.. ఒక విశ్లేషణ !

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 12:27 PM GMT
హైదరాబాద్‌లో కరోనా ఎలా ఉందో.. ఒక విశ్లేషణ !

తెలంగాణ ప్రభుత్వం కరోనాను సమర్థంగా కట్టడి చేస్తున్నట్లు చెప్పుకుంటోంది. అయితే... టెస్టుల విషయంలో మాత్రం విమర్శలు తప్పట్లేదు. దేశంలోనే అత్యంత తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే. చాలా చోట్ల రోజుకు పది వేలకు తక్కువ కాకుండా కరోనా టెస్టులు చేస్తుంటే.. తెలంగాణలో ఇప్పటిదాకా పరీక్షలు 30 వేలు దాటలేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 4 లక్షల దాకా టెస్టులు జరగడం గమనార్హం. పరీక్షలు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కేసులు బయటపడతాయని.. టెస్టులు తక్కువ చేసి రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని.. వైరస్‌ను కట్టడి చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. రాండమ్ టెస్టులు చేయకపోవడాన్ని నిపుణులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

కరోనా లక్షణాలు బయటికి కనిపించకుండానే ఎంతో మంది వైరస్‌తో ఉన్నట్లు వెల్లడవుతున్న నేపథ్యంలో రాండమ్ టెస్టులు చాలా అవసరం అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో హైదరాబాద్‌లో బయటపడ్డ ఒక తాజా ఉదంతం జనాల్ని కంగారు పెట్టిస్తోంది. హైకోర్టులో పని చేసే చింతల్ బస్తీకి చెందిన ఓ ఉద్యోగిని న్యాయమూర్తి ‘మీ కుటుంబ సభ్యులంతా బాగున్నారా’ అని అడిగారట. అందుకతను తన అన్నయ్య ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడట. దీంతో ఎందుకైనా మంచిది నేను చెబుతా, కరోనా పరీక్షలు చేయించుకోండి అంటూ ఆ న్యాయమూర్తి టెస్టులకు ఏర్పాట్లు చేయించాడట.

పరీక్షలు చేస్తే అతడి కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. వాళ్లందరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రజలు కరోనా టెస్టులు ఎక్కడ చేస్తారో తెలుసుకుని వాళ్లంతట వాళ్లు పరీక్షలకు రారని.. రాండమ్ టెస్టుల అవసరం చాలా ఉందని చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ అని నిపుణులు అంటున్నారు. ప్రతి కాలనీలో టెస్టింగ్ సెంటర్ పెట్టి పరీక్షలు చేస్తే వేలల్లో కేసులు వెలుగులోకి రావచ్చని.. ఇలా వదిలేస్తే చాలా ప్రమాదమని సూచిస్తున్నారు.

Next Story
Share it