గ్యాస్ ట్రబుల్ ఉందా ? ఇంట్లోనే ఇవి ట్రై చేయండి

By రాణి  Published on  31 March 2020 3:58 PM IST
గ్యాస్ ట్రబుల్ ఉందా ? ఇంట్లోనే ఇవి ట్రై చేయండి

గ్యాస్ ట్రబుల్. ఇది ఫలానా వయసు వారికే వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. మారుతున్న కాలంతో పాటు మన ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లు కూడా మారిపోతున్నాయి. టెక్నికల్ యుగంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిజ్జాలు, బర్గర్ లు, ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, బిర్యానీలు, పానీపూరి ఇలా ఎన్నో. ఆఖరికి బయట దొరికే టిఫిన్ల వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామంది గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు. కడుపు ఉబ్బరంగా, భారంగా ఉంటుంది. మరీ ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారికైతే కడుపు నొప్పి విపరీతంగా వస్తుంటుంది. జీర్ణకోశ వ్యవస్థలో కలిగే చాలా సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి. కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గ్యాస్ ట్రబుల్ లేదా కడుపుబ్బరం లేదా ఎసిడిటి కలుగుతుంది. చాలామంది గ్యాస్ ట్రబుల్ తగ్గించుకునేందుకు విపరీతంగా మందులు వాడుతుంటారు. మందులను కాస్త పక్కనపెట్టి ఇంట్లో ఉండే కొన్నిపదార్థాలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగి చూడండి.

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించే..8 చిట్కాలు

1. ఒక గ్లాసు నీటిలో వాము, బ్లాక్ సాల్ట్ ను వేయాలి. బాగా కలుపుకుని భోజనం తర్వాత ఈ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందుతారు.

2. ఒక గిన్నెలో పావు చెంచా పసుపు, అరకప్పు వేడినీళ్లు, ఒక టీ స్పూన్ ఉప్పు కలిపి బాగా కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగితే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది.

3.ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి ప్రతి రోజూ ఉదయం సేవించాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఇబ్బంది రాకుండా ఉంటుంది.

4.గ్లాసు నీటిలో అరకప్పు యాపిల్ ఫ్లేవర్ వెనిగర్ ను కలుపుకుని ప్రతిరోజూ తాగాలి.

5. ఒక కప్పువేడి పాలల్లో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఊహించని రీతిలో ఉపశమనం పొందుతారు.

6. ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని తాగాలి.

7.అల్లం టీ. ప్రాచీన కాలం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉపశమనం కోసం ఈ అల్లం టీ ని వాడుతుంటారు. వేడినీటిలో రెండు టీ స్పూన్లు అల్లం రసం, ఒక చెంచా తేనెను కలపి అల్లం టీ ని తయారు చేసుకోవాలి.

8. నిమ్మరసం.. యాంటి ఆక్సిడెంట్ అయిన నిమ్మరసం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. కడుపులో ఉండే యాసిడ్ లెవల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. గ్యాస్ బుడగలను నియంత్రిస్తుంది. గుండె నొప్పి రాకుండా అరికడుతుంది. కప్పు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని కలుపుకుని 8 గంటల్లో రెండుసార్లు తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది.

అలాగే రోజుకు ఎక్కువగా నీరు తాగడం వల్ల ఎలాంటి గ్యాస్ ఇబ్బందులు మనల్ని దరిచేరవు. వీటిలో మీకు ఏ చిట్కా సరిపోతుందో..అది చేసి గ్యాస్ ట్రబుల్ ను నియంత్రించుకోండి.

Next Story