5 ఏళ్లుగా సెంచ‌రీలు.. ఈసారి మాత్రం 'మిస్‌'

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jan 2020 3:12 PM IST
5 ఏళ్లుగా సెంచ‌రీలు.. ఈసారి మాత్రం మిస్‌

ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(10) విఫలమయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతికి రోహిత్ అవుట‌య్యాడు. దీంతో 13 పరుగులకే టీమిండియా తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే, ఇంత‌కుముందు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల‌లో తొలి వన్డేల‌లో సెంచరీలు సాధించిన రోహిత్‌.. ఈసారి మాత్రం.. నిరాశ‌ప‌రిచాడు.

అంత‌కుముందు.. 2015లో ఎంసీజీలో ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్‌ 138 పరుగులు సాధించాడు. ఆ త‌ర్వాత‌ 2016లో వాకాలో అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో 171 పరుగుల భారీ సెంచ‌రీ చేశాడు. అనంత‌రం సిడ్నీ వేదిక‌గా 2019లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రోహిత్‌ 133 పరుగులు సాధించాడు. కానీ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో మాత్రం ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్‌ రెండంకెల స్కోరుకే ఔట‌య్యాడు.

ఇదిలావుంటే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో భారత ఓపెన‌ర్లు రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగును ఆరంభించారు. రోహిత్‌.. రెండు ఫోర్లు బాది మంచి ఊపులో కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన అద్భుతమైన బంతికి తడబడ్డ హిట్‌మ్యాన్‌.. షాట్‌ ఆడబోయి క్యాచ్ అవుట‌య్యాడు.

Next Story