హిట్‌మ్యాన్ ఔట్‌.. వ‌న్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి షాక్‌.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Feb 2020 5:43 PM IST
హిట్‌మ్యాన్ ఔట్‌.. వ‌న్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గ‌ట్టి షాక్‌.!

కివీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. పర్యటన నుండి టీమిండియా ఓపెన‌ర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అనూహ్యంగా త‌ప్పుకున్నాడు. కాలిపిక్క కండరాలు పట్టేయడంతో కివీస్‌తో చివరి టీ20లో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్ త‌ర్వాత ఫీల్డ్‌లోకి రాలేదు. రోహిత్‌కు కండరాలు పట్టేయ‌డంతో అప్ప‌టినుండి బీసీసీఐ పరిశీలనలో ఉంచింది.

గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో రోహిత్‌ మిగతా వన్డే, టెస్టు సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదనే విషయాన్ని బీసీసీఐ వర్గాలు కొద్దిసేప‌టి క్రితం స్పష్టం చేశాయి. న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్ వైదొలిగాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ పూర్తి ఫిట్‌గా లేడు. ఫిజియో సూచన మేరకు రోహిత్‌కు విశ్రాంతి తీసుకుంటున్నాడ‌ని.. బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఇక‌, న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్ వైదొల‌గ‌డంతో ఓపెనర్‌గా ఎవర్ని తీసుకొవాల‌నే అంశంపై బీసీసీఐ క‌స‌ర‌త్తు చేస్తుంది. ఈ రేసులో మయాంక్‌ అగర్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. అలాగే.. వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ జతగా పృథ్వీషా ఓపెనర్‌గా దిగే అవ‌కాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

మ‌రో ఓపెన‌ర్ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరం కావడంతో పృథ్వీ షాకు అవకాశం దక్కింది. ఇప్పుడు రోహిత్‌కు కూడా గాయం అవ‌డం చేత‌.. రిజర్వ్‌ ఓపెనర్‌గా అగర్వాల్, గిల్‌ల్లో ఎవరిని తీసుకుంటార‌నేది మేనేజ్‌మెంట్‌ తేల్చాల్సి ఉంది. వీరిద్దరూ ఈ సిరీస్‌కు ఎంపిక కాకపోయినా.. ప్రస్తుతం కివీస్‌ పర్యటనలో ఉన్నారు. భారత్‌-ఎ జట్టు తరఫున ఆడుతుండటంతో.. వీరిలో ఎవ‌రికో ఒక‌రికి మాత్రం చాన్స్‌ దక్కే అవకాశం ఉంది.

Next Story