వరంగల్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు వేయి స్తంభాల గుడి. వరంగల్‌కు 5 కిలో మీటర్ల దూరంలో హన్మకొండ నడిబొడ్డున ఈ ఆలయం ఉంటుంది. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాకతీయుల కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుదిశలా చాటి చెప్పింది ఈ ఆలయం.
వేయిస్థంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో రుద్రేశ్వరుడు,విష్ణు,సూర్య భగవానుల కొలువైనారు. ప్రతి స్థంభానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆలయానికి ఉత్తర దిక్కున మండపానికి ఆలయానికి మధ్యలో నల్లరాతితో చెక్కిన నంది విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. భక్తులు మొదట నందిని దర్శించుకున్నాకే ఆలయంలోకి ప్రవేశిస్తారు.
చాళుక్యుల శైలిలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు,పలు పురాణ ఘట్టాలను తెలియజేసే శిల్పాలు కళ్లు చెదిరిపోయేలా ఉంటాయి. మహాశివరాత్రి, కార్తీక మాసంలో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శివరాత్రి రోజున శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు.
మాఘ, శ్రావన, కార్తీక మాసాల్లో ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే సిరిసంపదలు, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. స్థానిక భక్తులే కాకుండా హైదరాబాద్, జనగాం, కరీంనగర్ వంటి ప్రాంతాల నుండి కూడా భక్తుల పెద్ద సంఖ్యలో శివయ్యను దర్శించుకోవడానికి తరలివస్తారు.