'గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ'.. కాకతీయుల చరిత్రకు సజీవసాక్ష్యం
Specialties of Great Wall of Telangana. తెలంగాణ చరిత్రలో మరుగున పడిన అవశేషాలెన్నో ఉన్నాయి. వాటిలో 'గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ' ఒకటి. ఇది నాగర్‌కర్నూల్
By అంజి
తెలంగాణ చరిత్రలో మరుగున పడిన అవశేషాలెన్నో ఉన్నాయి. వాటిలో 'గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ' ఒకటి. ఇది నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సమీపంలో ఉంది. ఈ గోడ పొడవు 120 కిలోమీటర్లు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కాకతీయుల వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ గోడ ఈ మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి ప్రారంభమై ఫరహాబాద్ మీదుగా కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల వరకూ ఈ గోడ విస్తరించి ఉంది.
8వ శతాబ్దంలో అమ్రాబాద్ ప్రాంత సామంత రాజు పట్టభద్రుడు అమ్రాబాద్ కోట నిర్మాణానికి పునాదివేశాడు. ఆ తరువాత 13వ శతాబ్దంలో కాకతీయుల ఆధీనంలోకి వచ్చిన ఈ కోటను, రాణి రుద్రమదేవి కొంత నిర్మాణం చేపట్టగా, తదనంతరం ప్రతాపరుద్రుడి పాలనాకాలంలో కోట నిర్మాణం పూర్తయింది. ఆ కోటకు రక్షణగా, అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా 120 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడను ప్రతాపరుద్రుడు నిర్మించాడు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉత్తరాన కోట ఉండగా, దాని రక్షణ కోసం నిర్మించిన ఈ గోడ నల్లమలలోని కృష్ణానది తీరం మీదుగా విస్తరించి ఉంది.
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం అమ్రాబాద్ కోటను చివరగా ఏలినవారు చింతకుంట ప్రభువులు. ఆ తర్వాత శత్రురాజ్యాల దాడులను తట్టుకొని నిలబడిన ఈ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు ప్రస్తుతం అక్కడక్కడ ఉన్నాయి. ప్రకృతి బీభత్సాలు, దొంగల దాడులు, గుప్తనిధుల కోసం తవ్వకాలవల్ల గోడ మొత్తం దెబ్బతింది. ఐదారు కిలోమీటర్ల మేర కూలిపోయిన స్థితిలో ఉంది. మన్ననూరుకు సమీపంలో ఉన్న కొండపైకి సుమారు కిలోమీటరు వరకు ఎక్కిన తర్వాత, చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల మేర కోటగోడ కనిపిస్తుంది. మరోవైపు ఫరహాబాద్ అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు ఇరువైపులా కోటగోడలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.