మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో భద్రతా దళాల బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఉదయం 8 గంటల నుండి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరుగుతున్నాయి. సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరుగుతున్న భీకర ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.
ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్‌లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే. మార్చి 20న భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి. బీజాపూర్ - కాంకేర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో 30 మంది హతమయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 90 మంది మావోయిస్టులు మృతి చెందారని అంచనా.