'నాగులవంచ' డచ్ వాడిపై తొడగొట్టిన గ్రామం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Oct 2019 3:45 PM GMTచెరిపితే చెరిగిపోదు చరిత్ర..
పునాదుల్లో నిక్షిప్తమై ఉంటుంది..
మట్టి పొరల్లో జ్ఞాపకాలు ఊసులాడుతుంటాయి..
ఎప్పుడెప్పుడూ బయటకు వద్దామా అని చూస్తుంటాయి..
ప్రతి ఊరుకు ఓ చరిత్ర ఉంటుంది..
ప్రతి పొలిమేరకు ఓ గాధ ఉంటుంది..
తిరుగుబాట్లకు పుట్టినిల్లు పట్నాలు కాదు..పల్లెలే..
పల్లెల్లోనే ఉద్యమాలు ప్రాణం పోసుకున్నాయి..
సామ్రాజ్యవాదుల పునాదులను కదిలించాయి..
సముద్రాలు దాటి వచ్చిన వారు..
పల్లెలు చేసిన తిరుగుబాట్లకు తలొగ్గి..సరిహద్దులు దాటి ..సముద్రం బాట పట్టారు.
�
స్వాతంత్ర్య పోరాటమంటే మనకు గాంధీ జీ గుర్తొస్తారు..సుభాష్ చంద్రబోస్ మనసులో మెదులుతాడు. ఉప్పు సత్యగ్రహం గుర్తొస్తుంది. క్విట్ ఇండియా నినాదాలు చెవుల్లో మారుమోగుతుంటాయి. 1947 నుంచి ఓ శతాబ్దం ముందుకు వెళ్తే 1857 తిరుగుబాటు కళ్లకు కడుతుంది. దేశం కోసం ప్రాణాలు వదిలిన సిపాయిల త్యాగాలు, ఆ ఉరితాళ్లు కళ్ల ముందు కదిలాడుతాయి, కళ్ల వెంట కన్నీటి చుక్కలు రాలుతాయి. కాని..అంతకంటే ముందే..బ్రిటిష్ వారి కంటే ముందే..డచ్ వాళ్లపై ఇండియాలో ఓ తిరుగుబాటు జరిగింది. డచ్ వాళ్లను సరిహద్దులు దాటి సముద్రం దిక్కుకు పారిపోయేలా చేసింది. అది ఎక్కడో కాదు..తెలుగు గడ్డపై ఆ తిరుబాటు నినాదాలు మారుమోగాయి. నీలి మందు వర్తకం కోసం వచ్చిన డచ్ వారు స్థానికుల తిరుగుబాటుతో గుండెలు అరచేతిలో పట్టుకుని పరుగులెత్తారు.
అది మధ్యయుగానికి , ఆధునిక యుగానికి మధ్య కాలం. పల్లెలు వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కాలం. వ్యాపారమంటూ పాశ్చత్యులు భరతభూమిపై అడుగుపెడుతున్నారు. అలా అడుగుపెట్టిన వాళ్లలో డచ్ వారు ఫస్ట్. అదీ మన తెలుగు నేలపై వాలారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యమేలారు. స్థానికులను లొంగదీసుకున్నారు. పరాయివాడు దగ్గిస్తే మనోడు..అదీ తెలుగోడు ఊరుకుంటాడా.?!. ఊరుకోడు..డచ్ వారిపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. స్థానిలకుల తిరుగుబాటుకు తలొగ్గి..డచ్ వారు 'నాగుల వంచ' అనే గ్రామంలో తమ స్థావరాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్టోబర్ 13, 1687న నాగులవంచ గ్రామాన్ని వదిలి వెళ్లినట్లు స్వయంగా వారే రాసుకున్నారు. పోరాటం ఎలా సాగింది..? పోరాటం స్థానికంగానే పరిమితమైందా? .ఎన్నేళ్లపాటు తిరుగుబాటు కొనసాగింది..? అనే చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేకపోయినప్పటికీ...ఓ తిరుగుబాటుకు..విదేశీయుల ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా 'నాగులవంచ' నిలిచింది. ఆగ్రామ చరిత్రలోకి ఇప్పుడు వెళ్దాం...మన పుస్తకాల్లోని చరిత్రను చదువుదాం..
�
తెలంగాణ రక్తంలోనే పోరాటముంది. నిజాంను ఎదురొడ్డి నిలిచి, రజకార్లను తరిమికొట్టిన గడ్డ ఇవన్నీ మనం చదువుకున్నాం. మన తాతలు, అమ్మమ్మలు కథలు రూపంలో చెబుతుంటే విన్నాం. కాని..మనం చదవబోయే కథ మన తాతకలకు కూడా తెలియదు. ఓ గ్రామంలోని రాళ్లకు, చెట్టుపుట్టకు తప్ప. తెలంగాణ రాష్ట్రంలోని 'నాగుల వంచ' అనే గ్రామంలో మట్టి పొరల్లో నిక్షిప్తమై ఉంది ఆ గ్రామ ఉద్యమం. ఇది..సిపాయిల తిరుగుబాటు, ఝూన్సీ లక్ష్మీబాయి, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కంటే ముందే జరిగిన తిరుగుబాటు. ఈ పోరాటంలో మనోడే గెలిచాడు. బ్రిటీష్ వారి కంటే ముందే డచ్ వారు వచ్చారు. వారు ..గొల్కొండ కోటకు , మచిలీ పట్నం పోర్ట్‌కు మధ్యలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నీలి మందు పంట పుష్కలం. అంతేకాదు...అమరేల్ అనే విలువైన స్టోన్స్ దొరికేవి. దీంతో..డచ్ వారు ఇక్కడ తిష్ట వేశారు. వారి సైన్యం వేలల్లో తిష్ట వేసింది. 1669లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. స్థానికులను లొంగదీసుకుని మహాసామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్నారు.ఇది గమనించిన ప్రజలు చేయొత్తి జైకొట్టుఅంటూ విప్లవ బాట పట్టారు.
�
అది ఉద్యమం కాదు..ఉప్పెన. ఉప్పెన కూడా చిన్న పదమే..అదొక సునామీ. సైలెంట్ గా వచ్చిన ఉద్యమం..సునామీని సృష్టించింది. ఆ ఉద్యమ సునామీలో వేలాది డచ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఉద్యమ సెగలను తట్టుకోలేక డచ్ వారు అక్టోబర్ 13, 1687న నాగులవంచ గ్రామంలోని తమ స్థావరాన్ని వదిలి వెళ్లిపోయారు. డచ్ భారత దేశాన్ని శాశ్వతంగా విడిచి వెళ్లడానికి ముందు, బ్రిటీష్ వాళ్లు ఇండియాను విడిచి వెళ్లడానికి ముందు ఓ మహోద్యమం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఎప్పుడో 17వ శతాబ్దం నాటి చరిత్ర కావడంతో అందరూ దీన్ని మరిచిపోయారు. తరువాత వచ్చిన చరిత్రకారులు కూడా దీనిని గుర్తించడానికి చాలా సమయమే పట్టింది. కాని..చరిత్ర చెరిపితే చెరిపోదు. ఏదో ఒక రూపంలో భూపొరలను చీల్చుకుంటూ బయటకు వస్తుంది. డచ్ వారి అధికార పత్రాలు కూడా అదే చెబుతున్నాయి. నాగులవంచలో ఉన్న డచ్ నాయకుల సమాధులపై ఉన్న రాళ్లు చరిత్రను కళ్ల ముందు ఉంచుతున్నాయి. ఆనాటి పొరాటాలను కళ్లకు కడుతున్నాయి.
నాగులవంచను 'వొలందులోరిపట్నం' అంటారు. అంటే ఏమిటి అని అడిగితే.. ఆగ్రామస్తుకే తెలియదు. కాని..అక్కడ చరిత్ర ..కాదు.. ఓ పెద్ద పోరాటం ఉంది. వలందులు అంటే డచ్ వారు. వారు స్థావరంగా చేసుకుని ఉన్న ప్రాంతం కావడంతో వలందులొరి పట్నం అని పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. శిలాశాసనాలు ఎలా మట్టిలో కలిసిపోవో.. కలిసిపోయినా అక్షరాలు ఎలా బతికి ఉంటాయో..అలా కొన్ని జ్ఞపకాలు భూమి పొరల్లో ఉంటాయి. దానికి నాగులవంచ గ్రామమే ఉదాహరణ. నాగులవంచను డచ్ వారు 'నాగెల్ వాంజే' అని రాసుకున్నారు. మనవాళ్లకు మాత్రం వాళ్లను 'వలందులు' అన్నారు.
ఎక్కడ నుంచో సప్త సముద్రాలు దాటి వచ్చిన డచ్ వారికి ఈ నేల వేల కోట్ల సంపదను ఇచ్చింది. వారి పోరాటాలను, దోపిడీలనే కాదు వారి దేహాలను భూమి పొరల్లో దాచి పెట్టుకుంది. ఇక్కడి నేలపై డచ్ వారి సమాధులు ఉన్నాయి. వాటిపై రాతలు జ్ఞాపకాలను తట్టిలేపుతుంటాయి. వందల ఏళ్లు గడిచినా డచ్ వారు మాత్రం ఇక్కడి నేలను మరువలేదు. సమాధుల్లో ఉన్న వారి వారసులు ఇక్కడికి వచ్చి పోతుంటారు. వారి పెద్దలకు ప్రార్ధనలు చేస్తుంటారు. ఇక్కడి నేల గొప్పదనం గురించి కూడా వారు రాసుకున్నారు.
డచ్ వారు భారతదేశానికి ఎందుకు వచ్చారు?..
భారతదేశ వాతావరణమే ప్రత్యేకం. మూడు వైపుల సముద్రం. దేశంలోపల అంతులేని జలసంపద. ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన వాతావరణం.అపారమైన ఖనిజ సంపద. ఏడాది పొడవునా చలితో, మంచుతో కప్పబడే దేశాలు ఇండియాను టార్గెట్ గా పెట్టుకున్నాయి. ఇక్కడ సంపదను దోచుకోవడానికి పక్కా స్కెచ్‌తో అడుగు పెట్టారు. 15వ శతాబ్ధంలో నౌకానిర్మాణ రంగంలోనూ, నౌకా సాంకేతికతలోను వచ్చిన పురోగతిని అందిపుచ్చుకుని స్పెయిన్, పోర్చుగీస్ దేశాలు విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించాయి. ఆ తరువాత ఇంగ్లండ్, ఫ్రాన్స్ డెన్మార్క్‌లు కూడా అదే పద్ధతిని పాటించాయి. క్రీ.శ. 1494లో స్పెయిన్ దేశస్థుడు కొలంబస్ భారతదేశానికి చేరుకోవాలని బయలుదేరి అమెరికాను కనుగొన్నాడు.
పోర్చుగల్ దేశస్థుడైన వాస్కోడిగామా లిస్బన్ నుంచి బయల్దేరి ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా పయనించాడు. అంతేకాకుండా గుడ్ హోప్ అనే గ్రామంలో బస కూడా చేశాడు. తరువాత హిందూ మహాసముద్రం గుండా పయనించి గుజరాత్ కు చెందిన అబ్దుల్ మాజీద్ అనే నావికుడ్ని కలుసుకున్నాడు. అతని మార్గదర్శకంలో పయనిస్తూ...మే17, 1498లో కేరళలోని కాలికట్‌లో అడుగుపెట్టాడు. ఆ ప్రాంత పాలకుడు జమోరిన్ షా.. వాస్కోడిగామాను సాదరంగా ఆహ్వానించాడు. మొట్టమొదటిగా సముద్ర మార్గాన వచ్చి భారతీయులను కలిసిన యూరోపియన్ వ్యక్తిగా వాస్కోడిగామా చరిత్రలో నిలిచాడు. క్రీ.శ. 1500లో కాబ్రల్, 1503లో మళ్లీ వాస్కోడిగామా వచ్చారు. పోర్చుగీసు వలస సామ్రాజ్య నిర్మాత అని పేరు వున్న అప్పాన్-సో-డి- ఆల్‌బుకర్క్ (1509-1515) విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలుతో స్నేహం చేశాడు. తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం నాశనం కావడంతో వీరికి సాయం ఆగిపోయింది. ఆ తరువాత బహమనీ సుల్తాన్ లు చెలరేగిపోయారు. వారి తర్వాత మన కథకి ముఖ్యమైన డచ్ వారి పరిపాలనా శకం ప్రారంభం అయ్యింది.
డచ్ వాళ్లు మొదటి ఎక్కడ ఉండేవారు..?. స్పెయిన్ నుంచి ఎందుకు విడిపోయారు..?
హాలండ్ దేశస్తులైన వీరు కొన్నాళ్ళు నెదర్లాండ్ పౌరులుగా ఉన్నారు. తర్వాత స్పెయిన్ వారి ఆధీనం నుంచి బయటికి వచ్చి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. పోర్చుగల్ ఆధీనంలో ఉన్నందువల్ల వీరు పడమటి నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. 1595 నుండి 1602 వరకు 15సార్లు భారత్‌ను సందర్శిం చారు. పోర్చుగీసుకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ వారితో కలిశారు. డచ్ వారందరూ కలిసి 1602లో డచ్ ఈస్టిండియా కంపెనీగా ఏర్పడ్డారు . భారత్‌లో తూర్పు సముద్ర మార్గాలపై వర్తకాన్ని సాగించారు. అప్పట్లో మచిలీపట్నం వరకూ గోలకొండ ప్రభువు ఆధీనంలోనే ఉండేది. 1605లో గోల్కొండ పాలకుడైన కులీ కుతుబ్ షా సహకారంతో భారతదేశంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. యూరోపియన్ వర్తకులు ప్రధానంగా భారతదేశానికి సుగంధ ద్రవ్యాల కోసం వచ్చేవారు. కానీ, డచ్‌వారు వాటితో పాటు వస్త్ర పరిశ్రమ మీద కూడా కన్నేశారు. బట్టలను ఇక్కడే తయారు చేయించి ఓడల్లో తమ దేశానికి తీసుకెళ్లి లాభాలు ఆర్జించేవారు.
'నాగులవంచ'లో డచ్ పాలకుల్లో ఎవరు అత్యుత్తముడు..?
1668 నుంచి 1687 వరకూ 19 సంవత్సరాలు నాగులవంచలో డచ్ వారు ఉన్నారు. ఆరుగురు ప్రధానాధికారులు పాలన సాగించారు. వీరికి మరో ఆరుగురు ఉప ప్రధానాధికారులు ఉండేవారు. ఇవన్నీ డచ్ రికార్డ్‌లు చెబుతున్నవే. ఎక్కువ కాలం అబ్రహం వాండర్ ఊర్ట్ నాగులవంచ గ్రామంతో అనుబంధాన్ని కలిగివున్నారు.ఈయన ఉపపాలనాధికారిగా తొమ్మిదేళ్ళు పనిచేసి ప్రధానాధికారిగా పదోన్నతి పొంది మళ్లీ ఆరేళ్లు పనిచేశారు. అంటే నాగులవంచలో 19 ఏళ్ళ డచ్ పాలనలో ఈయన పాత్ర 15 ఏళ్లు ఉంది. అందుకేనేమో ఈయన కుటుంబంతోపాటు ఇక్కడే ఉండేవాడు. దీన్నిబట్టి ఆయనకు ఈ ప్రాంతంపై ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈయన మరణానంతరం ఇక్కడే సమాధి చేయబడ్డారు. డచ్‌వారి సమాధులను 'మెమొంటమోరీలు' అంటారు. అటువంటి 'మెమొంటమోరీ 'పైకప్పు బండపై ఉన్న రాతల వల్ల అది ఈయనదే అని తెలిసింది. అది ఇప్పటికీ నాగులవంచ గ్రామంలో రోడ్డుపక్కన ఉంది. దీనితో పాటు మరో సమాధి బండ కూడా ఈ గ్రామంలో ఉంది.
డచ్ వారిపై స్థానికుల ప్రజాపోరాటం
డచ్ వారు రాజకీయంగా, సైనికంగా చిన్నవారైనా తెలివితేట్టల్లో మాత్రం బ్రిటీష్, ఫ్రాన్స్ వాళ్లకు తీసిపోరు. కానీ, 1759లో 'బెడెరా' యుద్ధంలో బ్రిటీష్ వారి చేతిలో ఓటమి చవిచూసేంత వరకూ వీరి ప్రాబల్యం దేశంలో నడిచింది. కానీ అంతకంటే ఆరేడు దశాబ్ధాలకు ముందే 1687లో జరిగిన 'నాగులవంచ' ప్రజాపోరాటానికి అత్యంత పటిష్ఠంగా ఏర్పాటు చేసుకున్న డచ్ స్థావరం హడలెత్తి పోయింది. చివరకు అక్టోబర్ 13వ తారీఖున మొత్తంగా నాగులవంచను వదిలేసి పెట్టే బేడా సర్ధుకుని వేరే చోటుకు వెళ్లిపోయారు డచ్ వారు. అయితే...ఈ పోరాటం ఎవరి సారధ్యంలో నడిచింది అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.
తమ వ్యాపార స్థావరంగా నాగులవంచనే ఎందుకు ఎంచుకున్నారు..?
నాగులవంచ గ్రామం మచిలీపట్నానికి, గోల్కొండ రహదారిలో ఉంటుంది. ఈ దారి 16వ శతాబ్ది నుంచి ఉందని ఆధారాలున్నాయి. Journal of Deccan Studies (2010)లో Robert Alan Simpkins ఈ బాట గురించి The Mysterious Milestones of Andhra Pradesh అని ఒక ఆసక్తికరమైన వ్యాసం కూడా రాశారు. అటువంటి ప్రధాన రహదారికి కొంచెం పక్కగా నాగులవంచ గ్రామం ఉండేది. ఈ గ్రామం అప్పటి డచ్ ముఖ్యకార్యదర్శి నికోలస్ ఫాబర్‌కు బాగా నచ్చింది. దానికి కారణం నాగులవంచ పెద్ద గ్రామం. రుచికరమైన ఆరోగ్యవంతమైన మామిడిపండ్లను అందించే మామిడి తోటలు ఉండేవి. గ్రామం చుట్టూ పది చెరువులు. నీటికి కొరత లేదు. పైగా అసలే పెద్ద గ్రామమైన నాగులవంచను ఆనుకుని అప్పట్లో మరో మూడు గ్రామాలు. గ్రామంలో ఐదు శివాలయాలు, ఐదు వైష్ణవాలయాలు ఉన్నట్లు ఫాబర్ తన బుక్‌లో రాసుకున్నాడు. ఊరి మధ్యలో ఓ కోటను కూడా కట్టారు. దాని చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించుకున్నారు. నాగుల వంచలో 'వంచ'అంటే వాగు అని అర్ధం. అలాగే..వంచ అంటే 'పై వస్త్రం' అని కూడా అర్ధముంది. ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత డచ్ వారు స్థానికుల మీద పెత్తనం చేయడం మొదలు పెట్టారు. బలవంతంగా పత్తి పంట వేయమని గ్రామస్తులను బెదిరించే వారు . వారి భయపెట్టి నూలు వడికించేవారు. బట్టలకు రంగులు అద్దించేవారు . ఈ ఊరికి ఈ పేరు ఎలా వచ్చింది అనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి. సరైన ఆధారాలు మాత్రంలేవు.
నీలి రంగు ఎలా తయారు చేస్తారు..?
అలాగే గోరింటలోని ఒక రకం మొక్క నీలి గోరింట . మధుపర్ణిక మొక్క నుంచి నీలిమందు తయారుచేస్తారు. ఇది బట్టలకుడ్రై ) చేసేందుకు అద్దకపు రంగుగా విస్తృతంగా వాడారు. నీలి గోరింట మొక్క ఉష్ణమండలం , సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరుగుతుంది. అందుకే శీతల దేశాలు తప్పనిసరిగా ఈ విషయంలో పరాయి దేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫైగా భారతదేశంలో పెరిగే నీలిమందు మొక్కల రకం అద్దకానికి మరింత శ్రేష్టమైంది. నీలి రంగు ఆకులతో, చిన్న చిన్న పసుపు పచ్చని పువ్వులతో, రెండేళ్ళకోసారి పెరిగే ఈ మొక్క ఆవజాతికి చెందింది.దీని శాస్త్రీయ నామం ఇండిగోఫెరా టింక్టోరియా . ఈ మొక్కలని కోసి, కట్టలుగా కట్టి, ఇటుకలతో కట్టిన కుండీలలో వేసి, నీళ్ళతో తడిపి ఒక రోజుపాటు నానబెడతారు. ఎండుగడ్డి రంగులో ఉన్న తేటని మరొక కుండీలోకి వెళ్ళేలా వారుస్తారు. ఈ తేటని రెండు మూడు రోజులపాటు చిలకాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇద్దరు, ముగ్గురు మనుషులు ఈ కుండీలలోకి దిగి, తెడ్లతో ఈ తేటని బాదుతారు. అప్పుడు ఎండుగడ్డి రంగులోంచి ఆకుపచ్చ రంగులోకి మారి, క్రమంగా నీలిరంగులోకి వస్తుంది.
మన నేల గుండెల్లో డచ్ సమాధులు..!
నాగులవంచ ఊరి బయట డచ్ వారికి సంబంధించిన రెండు సమాధి బండలు ఉన్నాయి. ఇవి సమాధి పైకప్పు మూత బండలు. ఆరడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు, ఎనిమిది అంగుళాల మందంతో గట్టి నల్ల గ్రానైట్ బండలు ఇవి. వాటి పై కప్పుపై డచ్ భాషలో రాత శాసనం కూడా ఉంది. ఎక్కడో సముద్రాల అవతల పుట్టిన వ్యక్తి ఈ నేలపై మట్టిలో కలిసిపోవడం ఆశ్చర్యకరం. అంతేకాదు..ఇది పచ్చి నిజం. డచ్ వారికి కూడా మరణానంతర కర్మకాండ ఉంటుంది. దానికి అర్ధం 'గుర్తుంచుకో మృత్యువు తప్పదు' . క్రిస్టియానిటీలో స్వర్గ నరకాలు ఆత్మకైవల్యం వంటివి ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఈ మెమెంటమోరి సంస్కృతి విస్తృతమైంది.
అబ్రహాం వాండర్ ఊర్ట్ సమాధి శాసన పాఠం..తెలుగు అనువాదం
వస్త్ర వ్యాపారిగా స్థావర ఉపనాయకునిగా పనిచేసిన అబ్రహం వాండర్ వూర్ట్ ఇక్కడ సమాధి చేయబడ్డారు. 1640 పుట్టిన వూర్ట్ 1676 లో చనిపోయారు.. 8వ తారీఖున మరణించారు. నెలలో మొదటి అక్షరం A వరకూ కనిపిస్తోంది అంటే ఏప్రిల్ ,అగష్టు అయ్యివుండాలి. ఆయన ఈ భూమిపై జీవించిన కాలం 36 సంవత్సరాల ఎనిమిది నెలల నాలుగు రోజులు అంటూ రోజులతో సహా ఆయన జీవించిన కాలాన్ని సమాధిపై చెక్కారు. ఈ భౌతిక జీవితపు వెతలనుంచి విముక్తి పొందాడని ఈ పేటికలో అతనికి శాంతి చేకూరుతుందని, అతని దేహం ఇక్కడ మట్టిలో కలిసిపోగా ఆయన ఆత్మ స్వర్గానికి చేరుకుని దేవదేవుడిని కీర్తిస్తూ పాటలు పాడుతుంది అంటూ రాశారు. డచ్ వస్త్రవ్యాపార స్థావరం కోసం నాగులవంచను ఎంపిక చేసి ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రధాన పాలనాధికారి నికోలస్ ఫాబర్‌తో పాటే ఈ అబ్రహం వాండర్ ఊర్ట్ కూడా ఉపపాలనాధికారిగా ఎంపిక అయ్యారు. వీళ్ళిద్దరి పదవీ కాలాలు కూడా ఒకేరకంగా ఉన్నాయి. బహుశా అది అతని తొలి ఉద్యోగం కూడా అయ్యివుండొచ్చు, సమాధిపై పేర్కొన్న వివరాల ప్రకారం నాగులవంచలో నియమితుడయ్యే నాటికి అతని వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే, 36 ఏళ్ళ యువకుడిగానే 1676లో మరణించాడు. 1668 లో నాగులవంచ ఫ్యాక్టరీ స్థాపన సమయం నుంచి అబ్రహం వాండర ఊర్ట్ మరణించే నాటి వరకూ రెండుసార్లు అదే పదవికి ఎంపికకాబడి ఎనిమిదేళ్ళ పాటు ఇదే నాగులవంచలో పనిచేస్తూ చివరిశ్వాస విడిచాడు.
నికోలస్ ఫాబర్ సమాధి శాసనపాఠం.. తెలుగు అనువాదం
ఈ సమాధి స్థలంలో ఉంచుటకు అనుమతించబడిన నికోలస్ ఫాబర్ అనువారు కంపెనీ వర్తకునిగానూ, స్థావర ప్రధానాధికారిగానూ ప్రత్యేకంగా ఎంపికచేయబడి పనిచేశారు. ఈయన 1628 ఏప్రిల్‌లో జన్మించారు. వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఆరోగ్యం చెడిపోయి తనువు చాలించాడు . , ఆయన మరణం 8వ తారీఖు ఫిబ్రవరి 1676లో సంభవించింది. అప్పటికి ఆయన వయసు 47 సంవత్సరాలు. ఒంటరి సూర్యునిలా ఇతరుల సహాయమేమీ అవసరంలేకుండా దేదీప్యమానంగా ప్రకాశించిన నికోలస్ ఫాబర్ ఇలా చీకటి లోకి అలసట తీర్చుకునేందుకు చేరిపోయాడు. ఇక్కడ కుట్ర చేయడమా..పురుగులు శత్రువుల వలే అన్నారో అర్ధం కాలేదు. అటువంటి నికోలస్ ఫాబర్‌ను ఆకలితో వేటకు ఉపక్రమించిన వేగవంతమైన సింహంలా మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. వారి ఆత్మకు స్వర్గం ప్రాప్తించాలి అంటూ కోరుకున్నారు .చివరలో H అనే పొడి అక్షరాలతో పూర్తయ్యింది. ఆ పొడి అక్షరాలకు మెమెంటమోరీ సంప్రదాయాల ప్రకారం 'డియర్ హజ్బెండ్' అని కావచ్చు.
ఈ సమాధి బండ కూడా నాగులవంచకు తొట్టతొలిగా పనిచేసిన వారిదే ఈ నికోలస్ ఫాబర్ నాగులవంచ ఎంపికలో కూడా ప్రధాన పాత్ర వహించారు. మచిలీపట్నం - గోల్కొంకొండకు మధ్యదారిలో ఒక ఫ్యాక్టరీ ఉంటే బావుంటుంది అని డచ్ వారు చర్చిస్తున్న సమయంలో నాగులవంచ బాగుంటుందని ఎంపిక చేసినవాడు ఈయన. కుటుంబంతో సహా నాగులవంచలో జీవించాడు. చివరిలో వున్న'H' అంటే 'డియర్ హజ్బెండ్' అనే సాంప్రదాయం ప్రకారం 47 సంవత్సరాల వయసులో మరణించిన నికోలస్ ఫాబర్‌కు వివాహం అయ్యిందని.. ఆయన భార్య ఈ మెమెంటొమోరీ శాసనం రాయించారనీ తెలుస్తుంది. 1628లో పుట్టిన ఫాబర్ నాగులవంచకు 1668లో ప్రధానాధికారిగా వచ్చే నాటికి 40 సంవత్సరాలు. ఇతనికి సహాయ అధికారిగా వచ్చిన 28 ఏళ్ళ అబ్రహం వాండర్ ఊర్ట్ కూడా అదే సంవత్సరం నుంచి పనిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి 1676 వరకూ రెండు పర్యాయాలు ప్రధానాధికారిగా ఎంపికై తను మరణించేవరకూ 7 సంవత్సరాలు పనిచేశారు. చిత్రంగా ప్రధానాధికారి, ఉపప్రధానాధికారులు ఇద్దరు కూడా 1676లో కేవలం నెలల తేడాతో మరణించారు.
�
ఘనమైన చరిత్రను తన గర్భంలో దాచుకున్న నాగులవంచ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా.., చింతకాని మండలంలోని ...ఖమ్మం హెడ్ క్వార్టర్ నుంచి 20 కిమీ దూరంలో ఉంది. ఇప్పటికీ తన గర్భంలో చెరిగిపోని చరిత్రను దాచుకుని..పైకి పచ్చని పంటలు పండిస్తూ..ఆ గ్రామం మరిచిపోని చరిత్రకు చిరునామాగా సాగిపోతుంది.-
- వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్