మరో 50 ఏళ్లలో హిమాలయాలు కనిపించవా!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 10:48 PM IST
మరో 50 ఏళ్లలో హిమాలయాలు కనిపించవా!

కొండలు, లోయలు, కనుచూపు మేరా పచ్చదనం... చల్లని ప్రశాంత వాతావరణం.. ఒక్కో అడుగూ పైకి వెళ్తుంటే వెండికొండల్లా తళుకులీనే తెల్లని మంచుకొండలు. హిమాలయాల అందాలను కళ్లతో చూడాలే కానీ మాటలతో వర్ణించలేం. యోగులైనా..మహోభోగులైనా మనసుపడే మనోజ్ఞసీమ హిమాలయాలు అన్నారో కవి. కానీ ఇప్పుడు ఈ అందాలు కనుమరుగుయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన మొదలైంది.

హిమాలయాలు ఇప్పుడు ఫాస్ట్‌గా కరిగిపోతున్నాయి. గత పదేళ్లుగా హిమాలయాలు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నాయనేది సైంటిస్టుల మాట. వాతావరణ మార్పులు మంచు పర్వతాలపై చాలా ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ఓ వైపు కాలుష్యం పెరిగిపోవడం...మరోవైపు ఏసీలతో పాటు,బొగ్గు,గ్యాస్‌ వాడకం పెరిగింది. దీంతో వాతావరణంలో వేడి ప్రభావం పెరిగింది దీంతో వాతావరణ ఆవరణ ప్రాంతంలో తీవ్ర మార్పులు జరిగాయి.

21 వ శతాబ్దం మొదలుకుని హిమాలయ పర్వతాల్లోని మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నాయని తాజా పరిశోధన వెల్లడించింది. ఏటా అడుగున్నర ఎత్తు మంచు కరిగిపోతుందని....భవిష్యత్‌లో భారత్‌ సహా కోట్ల మంది నీటి కొరతతో ఇబ్బంది పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఈ మధ్య నెల రోజుల నుంచి హైదరాబాద్‌ విపరీత వాతావరణ పరిస్థితులు కన్పిస్తున్నాయి. సడెన్‌గా వేడి ప్రభావం పెరిగిపోతోంది. ఈ ఎఫెక్ట్‌తో గంటపాటు భీకర వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడడానికి వేడి పరిస్థితులే కారణం. ఈ వేడి వాతావరణమే ఇప్పుడు హిమాలయాలను కూడా ముంచెత్తింది. ఎన్నడూ లేని విధంగా మంచు వేగంగా కరుగుతోంది. గత 20 ఏళ్ల సగటును పరిశీలిస్తే....హిమాలయాల్లోని సగం ఐస్‌ ఇప్పటికే కరిగిపోయింది. 1975-2000 మధ్య కంటే... ఈ మధ్య రెట్టింపు స్థాయిలో మంచు కరిగిపోతుందట.

భారత్‌,చైనా, నేపాల్‌, భూటాన్‌ మీదుగా వ్యాపించిన హిమాలయ పర్వతాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశోధకులు అధ్యయనం చేశారు. తూర్పు నుంచి పశ్చిమం వరకు రెండు వేల కిలోమీటర్లు పరిధిలో విస్తరించిన 650 హిమఖండాలు ఉపగ్రహచిత్రాలను విశ్లేషించారు. వాతావరణ మార్పుల వల్ల హిమనీ నదులు కరిగిపోతున్నాయని తేల్చారు. ఇటీవల హిమానీ నదుల నుంచి ఏటా 8 బిలియన్‌ టన్నుల నీరు వస్తోంది. ఇది 32 లక్షల ఒలింపిక్‌ సైజు స్విమ్నింగ్‌ పూల్స్‌తో సమానం.

హిమాలయాల్లో ఉన్న మంచులో ఇప్పటివరకూ 25 శాతం మంచు పోయింది. ఇక అది తిరిగి ఏర్పడే అవకాశాలు కనిపించట్లేదు. మిగిలిన 75 శాతం మంచు కూడా వేగంగా కరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.దీని వల్ల వ్యవసాయం, జల విద్యుత్, మంచి నీటి సరఫరాకి సమస్యలు తలెత్తి 80 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడతారని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే నైరుతీ రుతుపవనాలు సరిగా స్పందించట్లేదు. వానలు పడేందుకు రెండు వారాలు ఆలస్యమవుతోంది. కారణం వేడి వాతావరణమే.తమిళనాడులో ఆల్రెడీ నీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. తాగేందుకు గ్లాస్ నీళ్లు కూడా దొరకట్లేదు. ఇటు హైదరాబాద్‌,ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు ఈ సారి పడ్డాయి. కానీ వచ్చే ఏడాది మాత్రం మరో రకమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

మొక్కలు పెంచడం, కాలుష్యాన్ని తగ్గించుకోవడం వంటివి చెయ్యకపోతే, భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

Next Story