ముఖ్యాంశాలు

  • నేడు మరోసారి ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
  • ఆర్టీసీ స్థితిగతులపై ప్రభుత్వం మరో అఫిడవిట్‌ దాఖలు

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. కార్మికుల డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ స్థితిగతులపై హైకోర్టులో ప్రభుత్వం మరో అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విలీనంపై మొండి పట్టు ఉంటే చర్చలు సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. రూ.47 కోట్లు చెల్లించిన మాత్రాన ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులు తొలగిపోవు అని ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఆర్టీసీ రక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం కేటాయించలేక పోతున్నామని తెలిపింది. చట్ట విరుద్ధంగా ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు దిగుతున్నాయి. సమ్మె చట్ట విరుద్ధమైనప్పటికి గత నెల 26వ తేదీన 21 డిమాండ్ల కోసం చర్చలకు పిలిచామని సీఎస్‌ తెలిపారు. విలీనంతో సహా డిమాండ్లు చర్చించాలని యూనియన్లు పట్టుబడడంతో చర్చలు విఫలం అయ్యాయన్నారు.

10,460 బస్సులతో టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటైందని, ప్రస్తుతం 2,609 బస్సులు మార్చాల్సి ఉందని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 2020 మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని తెలిపింది. యూనియన్లది కోర్టు ధిక్కరణ చర్య అని సీఎస్‌ అన్నారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో తీర్పు ఉండగా, దేశమంతా హైఅలర్ట్‌ ఉందని.. అలాంటి సమయంలో ఆర్టీసీ జేఏసీ సకల జనుల సామూహిక దీక్షలకు పిలుపునిచ్చిందన్నారు. ఈ నెల 11న కోర్టులో విచారణ ఉండగానే అత్యవసరంగా కార్యక్రమం చేశారని సీఎస్‌ తెలిపారు. ఇక తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే తమ కార్మికులపై లాఠీలతో పోలీసులు దాడులు చేశారని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ అఫిడవిట్‌ దాఖలుపై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.