అప్పటి వరకూ మృతదేహాలను గాంధీలో భద్రపరచండి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 10:27 AM GMT
అప్పటి వరకూ మృతదేహాలను గాంధీలో భద్రపరచండి

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు విచారణను హై కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ లోని చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకూ గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. నిందితుల ఎన్ కౌంటర్ ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అని న్యాయస్థానం రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం సూచించినవన్నీ పాటించినట్లైతే వాటికి ఆధారాలు చూపించాల్సిందిగా అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ను హై కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.

ఈ నెల 7వ తేదీ శనివారం తెల్లవారుజామున దిశ నిందితులను పోలీసులు ఘటనా ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ర్టక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరు పోలీసుల వద్దనున్న గన్ లను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో మిగతా గన్ లతో వారిని కాల్చి చంపారు. అయితే నిందితుల కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సమాచారమివ్వకుండా, కోర్టు నియమాలు పాటించకుండా ఎన్ కౌంటర్ చేసి ఆత్మరక్షణ కోసం చంపామని పోలీసులు కట్టుకథలు చెప్తున్నారని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హై కోర్టు విచారణకు రాగా కోర్టు శుక్రవారానికి కేసు వాయిదా వేసింది.

Next Story
Share it