తెలంగాణలో హై అలర్ట్.. విమానం దిగ్గానే ఆ ఏడుదేశాల వారు అక్కడికెళ్లాల్సిందే..!

By Newsmeter.Network  Published on  14 March 2020 5:48 AM GMT
తెలంగాణలో హై అలర్ట్.. విమానం దిగ్గానే ఆ ఏడుదేశాల వారు అక్కడికెళ్లాల్సిందే..!

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారిన 145 దేశాలు పడటంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. కరోనా వైరస్‌ భారిన పడినవారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. భారత్‌ దేశంలోనూ అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం అర్థరాత్రి నుంచి దేశంలోని పలు సరిహద్దు ప్రాంతాలు మూసివేయనున్నారు. దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్‌ చెక్‌ పోస్టులు ఉండగా వాటిలో 19 చెక్‌ పోస్టులు మాత్రమే పనిచేయనున్నారు.

Also Read : తనకు కరోనా లక్షణాలు లేవు.. అందుకే..! : ట్రంప్‌

కరోనా వైరస్‌ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వమూ అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఎయిర్‌ పోర్ట్ లో స్క్రీనింగ్‌ హెల్త్ డెస్క్‌ ద్వారా 57,214 మందికి స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. ఒక్క రోజులోనే 3,654 మందికి ఎయిర్‌పోర్టు హెల్త్ డెస్క్ లో స్క్రీనింగ్‌ టెస్టులు చేశారు. వారిలో 736 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్ట్ లు చేయించుకున్నారు. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 349 మంది గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌అయిన వారు 339 మంది కాగా, ఆరోగ్య శాఖ సూచన మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌ అయిన వారు 746మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు గాంధీ ఆస్పత్రిలో 339 మంది టెస్ట్ లు చేయగా 304 మందికి నెగిటివ్‌ తేలింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా లేదని అధికారులు పేర్కొంటున్నారు.

ఏడు దేశాలనుంచి వచ్చేవారు అక్కడికెళ్లాల్సిందే!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను రాష్ట్రంలోకి రానివ్వకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా వైరస్‌ అనుమానితులను గుర్తించి వారికి ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ రూంలలో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇతర దేశాల నుంచి వచ్చే వారిపట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. దీనిలో భాగంగా కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఏడు దేశాల(చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌) నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులను నేరుగా వికారాబాద్‌లోని హరిత రిసార్ట్స్ కు తరలించనున్నారు.

Also Read :కరోనా భయంతో ఎవరెస్టు అధిరోహణకు నో

శనివారం అర్థరాత్రి నుంచి 14రోజుల పాటు అక్కడ విడిగా ఉంచనున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే హైదరాబాద్‌ పరిసరాల్లో శిక్షణ కేంద్రాలను కూడా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణీకుల్లో ఎవరికైన కరోనా లక్షణాలు కనిపిస్తే నేరుగా గాంధీ, ఫివర్‌, ఛాతి ఆస్పత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే గవర్నర్‌ తమిళిసై తమ సమావేశాలను, కార్యక్రమాలను, పర్యటనలను రద్దు చేసుకుంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన సూచనల మేరకు ఆమె తన పర్యటనలు, సమావేశాలు వాయిదా వేసుకున్నట్లు గవర్నర్‌ కార్యాలయం ప్రకటన విడుల చేసింది.

Next Story