క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం... రెజీనా

By Newsmeter.Network  Published on  25 Dec 2019 2:19 PM GMT
క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం... రెజీనా

క్రిస్మస్ అంటేనే చిన్నచిన్న సంతోషాలు, ఆనందాలు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. అందుకే చిన్నప్పట్నుంచీ నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అంటూ చిన్ననాటినుంచీ తనకు క్రిస్మస్ పండుగతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటోంది ప్రముఖ తార రెజీనా. క్రిస్మన్ ట్రీని అలంకరిస్తూ, తాజా ప్లమ్ కేకుల్ని రుచిచూస్తూ, ఇంట్లోనే తయారుచేసిన తాజా వైన్ ని సిప్ చేస్తూ, స్నేహితులతో, చుట్టాలతో కలసి ఆడుతూ, పాడుతూ సందడిగా సాగే క్రిస్మస్ అంటే రెజీనా ప్రాణం పెట్టేస్తుంది. అసలు క్రిస్మస్ పండుగ వస్తోందంటేనే తనలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం పరుగులు పెడుతుంది. క్రిస్మస్ సంబరాల సంతోషాన్ని తన మాటల్లోనే విందాం.

డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ పండుగకోసం నేను సంవత్సరంలో మిగతా పదకొండు నెలలూ ఎదురుచూస్తాను. డిసెంబర్ 13వ తేదీ నా పుట్టిన రోజు. డిసెంబర్ నెలకోసం నేను అంత ఆత్రంగా ఎదురుచూడడానిక అదికూడా ఒక కారణమే. ఇంకొన్ని రోజులు గడిపేస్తే సందడి సందడిగా ఉండే న్యూఇయర్ వచ్చేస్తుంది. అంటే నెల రోజుల్లో వరసగా మూడు పండగలన్నమాట నాకు. నాతోపాటు మా కుటుంబంలో వాళ్లందరికీకూడా

తరానా పుట్టినరోజైతే క్రిస్మస్ పండుగరోజే

నా బెస్ట్ ఫ్రెండ్ తరానా పుట్టినరోజైతే క్రిస్మస్ పండుగరోజే. సో.. అస్సలు మర్చిపోవడానికి వీల్లేని రోజన్నమాట. ప్రతి సంవత్సరం మేం ఇద్దరం కలిసి డబుల్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఆ రోజున. ఎవరు సినిమాతో నాకు తెలుసు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలూ బాగానే ఆడాయి. కానీ ఇంకా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్

నాకు అవకాశాలిచ్చిన వాళ్లందరికీ, నన్ను నిలబెట్టిన వాళ్లందరికీ నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. తెలుగు ప్రేక్షకులకు నచ్చిన పిల్లగా రెజీనా అందరికీ పరిచయమైపోయింది. కానీ ఇంకా బ్లాక్ బస్టర్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఆ బ్లాక్ బస్టర్ బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నా

డిసెంబర్ ఒకటో తేదీనుంచే మెల్లగా క్రిస్మస్ ట్రీని అలంకరించడం మొదలుపెడతా. సీరియల్ బల్బ్స్ లైటింగ్, అందమైన రిబ్బన్లతో డిజైన్స్, చక్కటి ఆర్నమెంట్స్ ఇలా ఒక్కోటీ చేర్చుకుంటూ చేర్చుకుంటూ నాకు పూర్తిగా సంతృప్తి కలిగే వరకూ కనీసం ఓ చిన్న స్టోన్ తో సహా ఏదీ మిస్ చేయను క్రిస్మస్ ట్రీలో

ఇంటిపనుల్లో మాత్రం నేను జోక్యం చేసుకోను

అలాగే మెల్లగా క్రిస్మస్ పార్టీకి ఇంట్లోకూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతాయి. ఇల్లంతా సర్దేయడం, మార్పులు, చేర్పులు అన్నీ మామూలే. కానీ ఇంటిపనుల్లో మాత్రం నేను జోక్యం చేసుకోను. ఐ యామ్ ఎ ప్రిన్సెస్ ఇన్ మై హోమ్. నన్నస్సలు కాలు కిందపెట్టనివ్వరు మా ఇంట్లో. అంత గారాబం. మనం ఏది చెబితే అదే ఫైనల్. కానీ మరీ ఓవర్ డోస్ అయితే మాత్రం సున్నితంగానే కట్ చేసేస్తారనుకోండి.

చిన్నప్పుడైతే మా ఇంట్లో ఎలాగూ క్రిస్మస్ ఏర్పాట్లు చేసేవాళ్లం. దాంతోపాటుగా స్కూల్లోకూడా చాలా యాక్టివ్ గా క్రిస్మస్ పండుగ సంబరాలకోసం చాలా తాపత్రయపడి అన్నిట్లోనూ సాయం చేసేసేదాన్ని. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని, త్యాగంలో ఉన్న సంతోషాన్ని పూర్తిగా మనకి అందించే పండగ ఇదేనేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే క్రిస్మస్ పేరు చెబితేచాలు నాకు ప్రాణం లేచొస్తుంది.

స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోర్ టీమ్ లో నేను తప్పకుండా ఉండాల్సిందే. ఇక కారల్స్ పాడే గ్రూప్ లో అయితే నాదే లీడింగ్. క్రిస్మస్ కారల్స్ అన్నీ నాకు బాగా గుర్తుంటాయి. పైగా నేనెప్పుడూ వాటిని గుండెలోతుల్లోంచి పాడేదాన్ని. ఎంత సంతోషంగా ఉంటుందో. ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్, రోస్ట్ చికెన్, తాజా వైన్, ప్లమ్ కేక్స్ ఇంకా చాలా చాలా.. ఇవన్నీ క్రిస్మస్ పండుగ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్. క్రిస్మస్ లంచ్ కయితే ఎంతమంది వస్తారో మా ఇంటికి చుట్టాలు, తెలిసినవాళ్లు, వెల్ విషర్స్, ఫ్రెండ్స్. మొత్తం ఇల్లంతా సందడిసందడిగా ఉంటుంది.

అందరం ఫ్రెష్ వైన్ తీసుకుంటాం

క్రిస్మస్ రోజు అందరం కచ్చితంగా చర్చ్ కి వెళ్లి ప్రార్థనలు చేసొస్తాం. క్రిస్మస్ రోజున నేను గనక చర్చ్ కి వెళ్లకపోతే మా అమ్మ నన్ను చంపేస్తుంది. మా అమ్మ షీలా చాలా బాగా చాలా చాలా బాగా వంటచేస్తుంది. క్రిస్మస్ రోజు బోలెడన్ని వెరైటీస్. యమ్మీ.. తలుచుకుంటేనే నోరూరుతుంది. రాత్రి డిన్నర్ పూర్తైన తర్వాత ఇంక ఎంటర్ టైన్ మెంట్ హంగామా మొదలవుతుంది. అర్థరాత్రి ప్రత్యేకంగా ఇంట్లో తయారుచేసిన ఫ్రెష్ వైన్ అందరం తీసుకుంటాం. ప్రతి క్రిస్మస్ కీ మా అమ్మ ప్రత్యేకంగా దాన్ని తయారు చేస్తుంది. రమ్ , రైసిన్స్ కలిపి వండర్ ఫుల్ కేక్ చేస్తుంది.

క్రిస్మస్ రోజున ఎన్ని పనులున్నా అన్నీ బంద్. పూర్తిగా ఫ్యామిలీతో గడపాల్సిందే. పొద్దున్నే అందరం చర్చికెళ్లిపోతాం. అందరం కలసి హ్యాపీగా కారల్స్ పాడుకుంటాం. కానీ ఇప్పుడు అలా కుదరడం లేదు నాకు. మధ్యాహ్నం అందరం కూర్చుని మాట్లాడుకుంటూ హ్యాపీగా లంచ్ చేస్తాం. తర్వాత ప్రెండ్స్ ని, చుట్టాల్నీ పలకరించడానికి వెళ్తాం. అక్కడకూడా బోల్డంత వైన్, చాలా చాలా ప్లమ్ కేక్స్. ఎప్పటికీ మారని సంప్రదాయం ఇది. చాలా చాలా బాగుంటుంది

జయలలిత బయోపిక్ తలైవిలో మంచి రోల్

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నాను కాబట్టి ఈ క్రిస్మస్ కి ప్రత్యేకంగా ఏమీ చెయ్యలేకపోయాను. జయలలిత బయోపిక్ తలైవిలో మంచి రోల్. ఈసారి క్రిస్మస్ రోజున కూడా షూటింగ్ లోనే ఉంటాను. అయినా నాకేం బాధగా అనిపించట్లేదు. ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన రోజున కూడా నా ఫ్రొఫెషనల్ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉంటానుకదా. అందుకన్నమాట. నామీద నమ్మకంతో నాకు రోల్ ఇచ్చి వీళ్లంతా ఇంత ప్రోత్సహిస్తున్నారు, అభిమానిస్తున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలికదా. అందుకే ఈసారి పండక్కి ఇంటికెళ్లడంకంటే యూనిట్ తో కలిసి సంబరాలు చేసుకోవడమే నాకు ఇష్టం.

నాకు ప్రతి విషయంలోనూ ఒకరు అండగా ఉంటారు. అంటే తను నా వెన్నెముక అన్నమాట. అదెవరంటే మా అమ్మ. జీవితంలో మంచి చెడూ దేని గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఏ సందర్భంలో అయినా సరే నాకు అండగా ఉన్న మా అమ్మను తలచుకోకుండా క్షణమైనా ఉండలేను. క్రిస్మస్ సంతోషాన్నంతా మా అమ్మ నా మొహంలోనే చూడాలనుకుంటుంది. వర్క్ విషయంలో మాత్రం నా స్టైల్ నాదే. నాకు ఫ్యాషన్, గేమ్స్ చాలా ఇష్టం. ఎప్పుడూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది.

ఈ విషయంలో నేను నా స్టైలిస్ట్ దివ్యకు థాంక్స్ చెప్పాలి. అలాగే నా మేనేజర్ కి, సపోర్టింగ్ టీమ్ కి కూడా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను బెటర్ గా కనిపించేందుకు వాళ్లు చాలా శ్రమపడతారు. కేవలం వాళ్ల సపోర్ట్ వల్లే నేను ది బెస్ట్ మూవీస్ చేయగలుగుతున్నాను. ఈ క్రిస్మస్ కి నేరుగా నేను సెట్లో షూటింగ్ లో ఉంటున్నాను. అంతకంటే కావాల్సిన సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. నిజంగానే ఈ క్రిస్మస్ నాకు చాలా స్పెషల్.

Next Story