లావణ్య త్రిపాఠి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ

By అంజి  Published on  11 March 2020 10:37 AM GMT
లావణ్య త్రిపాఠి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ

కొద్దిగా గ్యాప్ తీసుకున్న తరువాత లావణ్య త్రిపాఠి వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యనే అర్జున్ సురవరంతో విజయాన్ని అందుకున్న లావణ్య వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. అది కూడా ఒక్కొక్కటి ఒక్కో జానర్ లో తెరకెక్కుతోంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి 'ఏ1 ఎక్స్ ప్రెస్' అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత ఓ డార్క్ కామెడీ చిత్రంలోనూ.. అలాగే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా నటించబోతోంది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం హిట్ అందుకోవడం లావణ్య త్రిపాఠి కెరీర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా అయిన ఏ1 లో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. హాకీ ప్లేయర్ రోల్ లో కనపడడానికి లావణ్య త్రిపాఠి ఎంతగానో కష్టపడిందట.. హాకీకి సంబంధించి ట్రైనింగ్ కూడా లావణ్య తీసుకొందంటే క్యారెక్టర్ పట్ల ఆమెకున్న ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఆమె దేనికైనా సిద్ధమేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాకు డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి నటిస్తున్న మరో చిత్రం 'చావు కబురు చల్లగా'.. డార్క్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'కౌషిక్ పెగళ్లపాటి' దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. లావణ్య పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. లావణ్య ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.. 'భలే భలే మాగాడివోయ్' సినిమాలో ఆమె అమాయకత్వానికి కామెడీ టైమింగ్ తోడై అద్భుతమైన సీన్స్ వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు.. ఈ సినిమాలో కూడా మరోసారి లావణ్య కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవాలని భావిస్తోంది.

లావణ్య మరో తమిళ సినిమాలో కూడా నటించబోతోంది. ఆ సినిమాలో హీరోగా అథర్వ మురళి నటిస్తున్నాడు. అందులో పోలీసు పాత్రలో అథర్వ కనిపించనున్నాడు. కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని లావణ్య భావిస్తోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రవీంద్ర మాధవ డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ సినిమాలో కూడా లావణ్యకు హీరోయిన్ గా ఛాన్స్ దక్కింది. ఈ ఏడాది చివరి లోపు సినిమా విడుదల కాబోతోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో బయటకు రానున్నాయి.

Next Story
Share it