జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

By అంజి  Published on  29 Dec 2019 9:55 AM GMT
జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్‌ 11వ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి రాహుల్‌ గాంధీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ హాజరయ్యారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎంగా హేమంత్‌ ప్రమాణస్వీకారానికి జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌ హాజరైనారు. హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారానికి పెద్ద సంఖ్యలో విపక్ష నేతలు హాజరుకావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణస్వీకారం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

జార్ఖండ్ ఎన్నికల ఫ‌లితాల‌లో గెలిచి విజయప‌తాకం ఎగురవేసిన‌ జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నిక‌ల్లో జేఎంఎం సొంతంగా 30 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు, కాంగ్రెస్ 16, జేవీఎం (పీ) 3, ఏజేఎస్‌యూ 2, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవసరమైన 41 సీట్ల సంఖ్యను సునాయాసంగా దాటేసిన జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి సాధించింది.

జార్ఖండ్ లో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటాలే ఆయనను విజయ తీరాలకు చేర్చాయనే చెప్పాలి. దేశంలో జార్ఖండ్ అత్యధిక గిరిజనులు ఉన్న రాష్ట్రం. గిరిజనుల హక్కులను కాపాడేందుకు హేమంత్ ముందుండి పోరాటం కొనసాగించారు. 2016లో గిరిజనుల భూములను కంపెనీలకు ధారపోసేందుకు బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దానికి వ్యతిరేకంగా భూమి హక్కుల పోరాటాన్ని హేమంత్ పెద్ద ఉద్యమాన్ని లేపాడు. లక్షలాది మంది గిరిజనులతో రోడ్డెక్కి హేమంత్ ఆందోళన బాట పట్టాడు. బీజేపీ సర్కార్ భూ చట్టాలను మార్చి గిరిజనులను నిలువునా ముంచుతుందని హేమంత్ ఆరోపణలు గుప్పించడంతో ఆయన మాటలను నమ్మిన గిరిజనులు ఈ ఎన్నికల్లో హేమంత్ కూటమినే అధికారం కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఐదు కీలక రాష్ట్రాలో బీజేపీ నుంచి చేజారిపోవడంతో కాషాయదళంలో టెన్షన్‌ మొదలైంది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌సింగ్‌, దేవేంద్రపడ్నావీస్‌, వసుంధరారాజే, రఘుబర్‌దాస్‌ లాంటి బలమున్న నేతలు పరాజయం చెందాల్సి వచ్చింది. దీంతో బీజేపీకి కలవరపాటు మొదలైందనే చెప్పాలి. ఇక త్వరలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి. ఇక ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు తగిన వ్యూహాలు రచించాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story