పట్నా: రోజురోజుకి బిహార్‌ రాష్ట్రంలో ఉల్లి ధర ఆకాశాన్నంటుతుంది. పెరిగిపోతున్న ఉల్లి ధర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయాలనుకుంది. ఆ పనిని బిహార్‌ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ శాఖకు అప్పగించింది. దీని ద్వారా ఉల్లిపాయలను కేజీ రూ.35కే ప్రజలకు అందిస్తున్నారు.

అయితే, ఇక్కడే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇందులో విచిత్రం ఏంటి అనుకుంటున్నారా..? అది ఏంటంటే ఉల్లిపాయలను ప్రజలకు అందజేసే వారు హెల్మెట్లను ధరించారు. అలా.. హెల్మెట్లు ఎందుకు ధరించారు..? అని వారిని అడగ్గా..’ఉదయం నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కిలోమీటర్ల మేర బారులు తీరి నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏలాంటి భద్రత చర్యలు ఏర్పాటు చేయలేదు. ఉల్లిపాయలను అందజేయడంలో ఆలస్యం అయితే వారు మాపై దాడి చేసే ప్రమాదం ఉంది. అంతా కలిసి రాళ్లు రువ్వే అవకాశం ఉంది. అందుకే మాకు మేముగా ఈ ఏర్పాట్లు చేసుకున్నామని’ వారు తెలిపారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలంతా వారిని విచిత్రంగా చూస్తున్నారు.
————

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్