తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ పడగ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 10:57 AM IST
తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ పడగ..!

విశాఖ: బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి తోడుగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం ఉంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Next Story