ఆస్ట్రేలియా లో కార్చిచ్చు - ఎమర్జెన్సీ ప్రకటన
By అంజి
ఆస్ట్రేలియాలో రగులుకున్న కార్చిచ్చు ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం లో మొదలైన ఈ చిచ్చు రోజురోజుకి విస్తరించడంతో అక్కడి అధికారులు ఏడురోజులపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని సిడ్నీతో పాటు పలు ప్రాంతాల్లో చెలరేగిన దాదాపు 100 కార్చిచ్చులతో జనావాసాలు పొగతో నిండిపోయాయి. బలమైన గాలులతో దావానలం వ్యాపిస్తుండటంతో పదుల సం ఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. గత కొద్ది వారాలుగా అనేక ప్రాంతాలలో రగులుకున్న కార్చిచ్చులు కొనసాగుతుండగానే సిడ్నీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతూ మరో కార్చిచ్చు ప్రారంభమైంది. మంగళవారం రికార్డుస్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు ఆస్ట్రేలియాను అట్టుడికించాయి. 40.9 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతతో, సెగలు గక్కుతున్న మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారు.
ఆస్ట్రేలియా రక్షణ దళాల తో పాటు అమెరికా, కెనడాకు చెందిన దళాలు కూడా రంగంలోకి దిగాయి. సుమారు రెండు వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఆయా ప్రాంతాల వాతావరణమంతా ముదురు గోధుమ వర్ణంలోకి మారింది. ఉష్ణోగ్రత పెరిగింది. మంటల ద్వారా ఏర్పడిన మబ్బులు నగరాలను కమ్మేస్తున్నాయి. పర్యాటక ప్రదేశాలు సైతం తమ శోభను కోల్పోయాయి. కాగా వాతావరణ మార్పులు, అధిక ఉష్ట్రోగ్రతలకు తోడు బలమైన గాలులూ వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పైగా ఈ ప్రాంతం తక్కువ తేమ శాతాన్ని కలిగి ఉండటంతో అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇదే ప్రాంతంలో గత సెప్టెంబర్లో కార్చిచ్చు రేగింది. ఈ ఘటనలో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి.