వేడుకున్నా వినలే.. పచ్చని పంటపొలాలను దున్నేశారు!

By Newsmeter.Network  Published on  11 March 2020 6:17 AM GMT
వేడుకున్నా వినలే.. పచ్చని పంటపొలాలను దున్నేశారు!

గుంటూరు జిల్లాలోని వినుకొండలో రైతులు లబోదిబోమంటున్నారు. పేదల ఇంటి స్థలాల కోసం తమ పచ్చని పంటపొలాలను దున్నేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో రైతులు సాగు చేసిన పచ్చని మిర్చితోటను ఇంటి స్థలాలకోసం రెవెన్యూ అధికారులు దున్నేశారు. మా నోటికాడ కూడు తీయొద్దు అని రెవెన్యూ సిబ్బందిని వేడుకున్నా కనికరించకుండా మిర్చి, ఆముదం పంటలను దున్నేశారని రైతులు కన్నీటి పర్యాంత మవుతున్నారు.

గ్రామంలో పేద రైతులు సాగు చేసుకున్న పంట పొలాలను రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌ సాయంతో దున్ని చదును చేసేందుకు ప్రయత్నించారు. కొంత పంటను కూడా దున్నేశారు. మిర్చి పంట బాగా కాపుమీద ఉంది. మరికొద్ది రోజుల్లో ఆరైతు మిర్చిని కూలీలతో కోపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అధికారులు పంటనే దున్నేందుకు సిద్ధమయ్యారు. పదిరోజుల క్రితం ఆ భూములను చదును చేసేందుకు వెళ్లిన అధికారులను కొంత సమయం ఇస్తే పండిన పంటను ఇంటికి చేర్చుకుంటామని అడిగిన రైతుల మాటను అధికారులు విని వెనక్కు వెళ్లారు. మళ్లీ స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడితో పొలాల్లోని పంటను తొలగించి చదును చేయాలని అధికారులు వచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. వచ్చిందే తడవుగా ట్రాక్టర్‌తో పొగాకు, ఆముదాలు, మిర్చి పైరును అధికారులు కొంత తొలగించారు. రైతులు అడ్డుకోవటంతో నిలిపివేశారు.

కష్టపడి పంటలు పండించుకున్నామని, ఇరవై ఏళ్లుగా ఈ పొలాల్లో సాగు చేసుకుంటామని రైతులు అధికారులు వద్ద వాపోయారు. తమ పొలాలను విడిచి వేరే ప్రాంతాల్లో పేదలకు ఇంటి స్థలాలు అప్పగించాలని వేడుకున్నారు. అయినా అధికారులు పంటపొలాలను చదునుచేసేందుకు సిద్ధమవ్వడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం ఈ భూములు ఎన్నెస్పీ భూములని, అందుకే పంటలను తొలగించి పేదలకు ఇంటిపట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నట్లు తెలుస్తుంది.

Next Story