మలేరియా వాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

ప్రాణాంతక మలేరియా వ్యాధిపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మరో వ్యాక్సిన్‌ను ఆమోదముద్ర వేసింది.

By అంజి  Published on  3 Oct 2023 5:35 AM GMT
malaria vaccine, World Health Organisation, Serum Institute of India, University of Oxford

మలేరియా వాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

ప్రాణాంతక మలేరియా వ్యాధిపై పోరులో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా మరో వ్యాక్సిన్‌ను ఆమోదముద్ర వేసింది. డబ్ల్యూహెచ్‌ఓ మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిందని, ప్రపంచంలోనే రెండవ మలేరియా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మార్గం సుగమం అయినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సోమవారం తెలిపింది. సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సిటీ R21/Matrix-M మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మలేరియా నుంచి ఇది 75శాతానికిపైగా రక్షణ కల్పిస్తుందని, ఇది మూడు డోసుల టీకా అని, బూస్టర్ కూడా వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

2024వ సంవత్సరం నుంచి కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఇది పిల్లలలో మలేరియాను నిరోధించడానికి ప్రపంచంలోనే రెండవ డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన వ్యాక్సిన్‌గా నిలిచిందని సీరమ్‌ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ వాడకానికి రెండు నిపుణుల బృందాలు చేసిన సిఫార్సు మేరకు ఆమోద ముద్ర వేసినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఘనా, బుర్కినాఫాసోలో అధికారవర్గాలు ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఆమోదించాయి. కాగా ఈ వ్యాక్సిన్‌కు పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి లైసెన్స్ ఉంది. కంపెనీ ఇప్పటికే సంవత్సరానికి 100 మిలియన్ డోస్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇది రాబోయే రెండేళ్లలో రెట్టింపు అవుతుంది.

"చాలా కాలంగా మలేరియా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజల జీవితాలను బలిగొంది. ఇది మనలో అత్యంత హాని కలిగించే వ్యక్తులను అసమానంగా ప్రభావితం చేస్తుంది" అని ఎస్‌ఐఐ సీఈవోడడడ అదార్ పూనావల్లా పేర్కొన్నారు. అందుకే డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు, టీకా ఆమోదం మలేరియాపై పోరాటంలో ఒక పెద్ద మైలురాయిని సూచిస్తుందని అన్నారు. మరోవైపు ఒక మలేరియా పరిశోధకుడిగా సురక్షితమైన వాక్సిన్ తీసుకురావాలనే కల తనకుండేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచం వద్ద రెండు మలేరియా వాక్సిన్​లు ఉన్నాయని వెల్లడించారు. ఈ మలేరియా వాక్సిన్​ ధర దాదాపు రెండు డాలర్ల నుంచి నాలుగు డాలర్ల వరకు ఉండొచ్చని టెడ్రోస్ వివరించారు.

Next Story