World No Tobacco Day: పొగాకు తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఇవే
సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం.. పొగాకు ప్రొడక్టులను తినడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారింది.
By అంజి Published on 31 May 2024 9:30 AM ISTWorld No Tobacco Day: పొగాకు తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఇవే
సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం.. పొగాకు ప్రొడక్టులను తినడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారింది. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హెచ్చరస్తున్నా.. ఈ అలవాటు నుంచి బయటపడటం లేదు. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది ఆరోగ్యానికి హానికరమని.. ఇది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా మే 31 వ తేదీన యాంటీ టొబాకో డే (పొగాకు వ్యతిరేక దినోత్సవం)ను నిర్వహిస్తోంది. దీన్ని ప్రపంచ నో టొబాకో డే గానూ పిలుస్తారు. పొగాకు వాడకం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలను మే 31న వివిధ కార్యక్రమాల రూపంలో వివరిస్తారు. వరల్డ్ నో టొబాకో డే నిర్వహించాలని 1987 ఏప్రిల్ 7వ తేదీన తీర్మానాన్ని డబ్ల్యూహెచ్‌వో ఆమోదించింది. 1988 మే 31 నుంచి ఏటా పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
పొగాకులో ఉండే నికొటిన్ అనే పదార్థం.. ధూమపానానికి బానిసలుగా మారేలా చేస్తుంది. ధూమపానం, పొగాకు ఉత్పత్తులను తినడం వల్ల ఊపిరితిత్తులు, గుండె సంబంధిత జబ్బులు, రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగ తాగే వారి జీవిత కాలం ఆరోగ్యంగా ఉండేవారితో పోలిస్తే పదేళ్లు తగ్గుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. పొగాకు వల్ల రక్త నాళాలు సంకోచించి, తాత్కాలికంగా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది.
తక్కువ నికొటిన్ గల సిగరెట్లు, చుట్టలు, బీడీలు కూడా ప్రమాదకరమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు ఊపిరితిత్తులపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల దీర్ఘకాల లంగ్స్ సమస్య సీవోపీడీకి దారి తీయొచ్చు. పొగతాగే మగవారి వీర్యం నాణ్యత తగ్గి, శుక్ర కణాల సంఖ్య తగ్గి.. సంతానంపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వారు గర్భం దాల్చక పిండం ఎదుగుదలపై ధూమపానం ప్రభావం చూపుతుంది. రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుంది.