వైద్య రంగానికే సవాలుగా మారిన 'మధుమేహం'.. నేడు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం
World Diabetes Day I వైద్య రంగానికే సవాలుగా మారిన 'మధుమేహం'.. నేడు అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం
By సుభాష్ Published on 14 Nov 2020 9:01 AM ISTప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికి సోకుతోంది. చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ మధుమేహం అభం శుభం తెలియని వారిని సైతం వెంటాడుతోంది.
మధుమేహం ఒక అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, వైద్య రంగానికే కొత్త సవాల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య కోట్లకు కోట్లు చేరుతోంది. ఎయిడ్స్ మహమ్మారి కంటే ఇది వేగంగా వ్యాపిస్తోంది. ఒకప్పుడు మలేరియా, కలరా, ఆటలమ్మ తదితర వ్యాధులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవి. ఇవి సోకితే ఆ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా జీవించాల్సి వచ్చేది. ఈ వ్యాధులను ఆధునిక వైద్య శాస్త్రంలో చాలా వరకు కట్టడి చేసింది. అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులా మారిన మధుమేహాన్ని నిర్మూలించడం వైద్య రంగానికే ఓ సవాలుగా మారింది.
అంటు రోగం కాకపోయినా.. కుటుంబంలో అందరికి..
డయాబెటిస్ అంటు రోగం కాకపోయినా.. ఒక కుటుంబంలోని వ్యక్తికి ఉన్నట్లయితే కొన్ని తరాల పాటు ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలోని అందరికి సోకే ప్రమాదం ఉంది. దేశాలకు, ప్రపంచం యావత్ అతలాకుతలమైపోవడం ఖాయమని ఐక్యారాజ్య సమితి హెచ్చరిస్తోంది. అందుకే ప్రతియేటా నవంబర్ 14న 'అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
మధుమేహం రెండు రకాలు
ఈ మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు గుర్తించారు. అందులో ఒకటి టైప్-1, రెండోది టైప్-2గానూ పేర్కొన్నారు. మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్-1 కింద పరిగణిస్తారు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది.
ఇక టైప్ -2: ఇది ఇన్సులిన్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతూ పూర్తిగా వినియోగం కాకపోయినట్లయితే దీనిని టైప్-2గా పరిగణించారు. ఇది ఎక్కువగా పెద్దలకు వస్తుంది. ఇటీవల కాలంలో చిన్న పిల్లలకు రెండు రకాల మధుమేహాలు వస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇలా చిన్న పిల్లలు మధుమేహం బారిన పడుతున్న దేశాల్లో ఆసియా దేశాలే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
రోజురోజుకు పెరుగుతున్న ఈ డయాబెటిస్ వ్యాధిని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. మామూలుగా మలేరియా, క్షయ, ఎయిడ్స్ వంటి వ్యాధులపై చొరవ చూపించే ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం మధుమేహంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తోంది. ఈ వ్యాధి తీవ్రతను అరికట్టేందుకు పలు రకకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా మందులు వాడటం, మిత ఆహారాన్ని తీసుకోవడం, ప్రతి రోజూ వాకింగ్, వ్యాయమం వంటివి చేయడం వల్ల వ్యాధి తీవ్రతరం కాకుండా కాకుండా అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.