మాస్క్ ఎందుకు ధరించాలి?.. ధరించినా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Why Mask is Necessary for Covid 19, Precautions to Covid. కోవిడ్-19 నివారణకు మాస్క్ ఎందుకు ధరించాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
By Medi Samrat Published on 21 April 2021 1:44 PM ISTదేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రెండున్నర లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ మాస్కు ధరించడమే ప్రధానమైనది. మాస్కు ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే విధంగా అవతలి వ్యక్తి దగ్గినపుడు, లేదా తుమ్మినపుడు వెలువడే నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా మాస్కు లేకుండా ప్రజలకు బయట తిరుగుతున్నట్టయితే జరిమానా విధించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
మాస్క్ ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కోవిడ్-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ ఏరోసోల్స్ (తుంపర్లు)లో మూడు గంటల వరకు ఉంటాయని గుర్తించారు. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకనే తప్పనిసరిగా మాస్కును ధరించాలి.
మాస్కును ధరించినా ఈ కింది జాగ్రత్తలను తీసుకోవాలి:
* ఎదుటివారికి కనీసం 1-మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి
* చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి
* మాస్కు ముందు భాగాన్ని లేదా ముఖాన్ని తాకడం చేయకూడదు
* మాస్కును పైన మరియు కింద సరైన పద్ధతిలో ధరించండి
* మాస్కును తీసుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోండి
* మాస్కు మురికిగా లేక పాడైపోయిందేమో పరిశీలించుకోవాలి
* మాస్కు లోపలి భాగం ముఖాన్ని మరియు ముక్కుని తాకుతూ కప్పి ఉంచుతుందో లేదో పరిశీలిచండి
* మాస్కు ధరించినపుడు ముఖానికి ఇరువైపులా గ్యాప్స్ లేకుండా సరిచూసుకోండి
* మీ మాస్కు ముక్కు, నోరును గడ్డాన్ని కప్పేలా ఉండేలా చూసుకోండి
* మాస్కును తీసివేసేటప్పుడు చేతులను శుభ్రం చేసుకోండి
* చెవుల దగ్గర ఉండే పట్టీలు తీస్తూ మాస్కును బయటకు తీయాలి
* తీసేసిన మాస్కును శుభ్రంగా ఉండే బ్యాగు లేదా కంటైనర్లో ఉంచాలి
* మాస్కును తీసేసిన తర్వాత మరోసాని చేతులను శుభ్రం చేసుకోవాలి
* మాస్కును రోజుకు ఒకసారైనా సబ్బు లేదా డిటర్జెంట్ తో శుభ్రం చేసుకోండి. వీలైనంత వరకు వేడి నీళ్లయితే మంచిది
మాస్కు ధరించినపుడు చేయకూడనివి:
* పాడైపోయిన మాస్కును తిరిగి ఉపయోగించవద్దు
* లూజుగా ఉండే మాస్కును ధరించవద్దు
* ముక్కు కిందికి వచ్చేలా మాస్కును ధరించవద్దు
* మీకు 1మీటరులోపు జనం ఉన్నట్టయితే ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్కు తీయవద్దు
* శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే మాస్కులను ఉపయోగించవద్దు
* మురికిగా, తడిగా ఉండే మాస్కులను ధరించకూడదు
* మీరు ఉపయోగించిన మాస్కులను ఇతరులతో పంచుకోవద్దు