మొలకెత్తిన గింజలతో ఎంతో ఆరోగ్యం!
Very healthy with sprouted nuts. మొలకలు అంటే తెలియని వారు బహుశా ఉండరేమో కదా. వాటిలో ఎన్ని
By Medi Samrat Published on 2 Feb 2021 6:17 PM IST
మొలకలు అంటే తెలియని వారు బహుశా ఉండరేమో కదా. వాటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి.. కేలరీలు పెరగవు. మొలకల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శనగలు, వేరుశనగ, పెసర్లు, చిక్కుళ్లు, సోయా, అలసందల నుంచి లభిస్తాయి. మొలకెత్తిన గింజల్ని వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా తినొచ్చు. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి.
మొలకలు శరీరానికి అత్యవసరమైనటువంటి న్యూట్రీషియన్. ఇది మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని బాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతుంది. మానవ శరీరంలో జీవక్రియల్నీ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో మెటబాలిజం రేటు పెంచుతుంది. శరీరంలో టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
గర్భిణులు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. మొలకల్ని ఉదయం పూట అల్పాహారంగా కానీ, సాయంత్రం పూట స్నాక్స్ లాగా కానీ తీసుకోవాలి. అలాని అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్ సమస్య వస్తుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా బారిన పడరు. మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. సలాడ్, చాట్, సూప్.. ఇలా ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.