పానీ పూరి..ఈ పేరు చెబితే చాలు దాదాపు అందరి నోరూరిపోతుంది. రోడ్డు పక్కన పానీ పూరి బండి కనిపిస్తే చాలు వెంటనే అక్కడకు వెళ్లి ఓ పట్టు పట్టేస్తుంటారు కొందరు. అయితే.. కొంద మంది పానీపూరిలో వాడే నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి చోట్ల పూనీ పూరి తింటే అనారోగ్యం కొనితెచ్చుకోక తప్పదు. కలరా కేసులు పెరుగుతుండడానికి పానీ పూరిలో ఉపయోగించే అపరిశుభ్రమైన నీరు కారణమని బావించిన అధికారులు పానీ పూరి అమ్మకాలపై నిషేదం విధించారు. అయితే.. ఇది మన దగ్గర కాదులెండి. నేపాల్ దేశంలోని ఖాట్మండు వ్యాలీలో.
వివరాల్లోకి వెళితే.. ఖాట్మండ్ వ్యాలీలో ఇటీవల కలరా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం పానీపూరిలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, కారిడార్ ప్రాంతాల్లో పానీపూరీ విక్రయాలను నిలిపివేయించారు. అంతేకాకుండా పానీ పూరీ విక్రయాలు, పంపిణీని నిషేదించినట్లు లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ అధికారులు తెలిపారు. ఎవరికైనా కలరా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని వెళ్లాలని సూచించారు.