ప్రజారోగ్య హెచ్చరిక: మీరు మందులు ఎక్కడ నుండి కొంటున్నారు.. ఎలాంటివి కొంటున్నారు?

‘ఫాల్సిఫైడ్ మెడిసిన్స్’.. ఉద్దేశపూర్వకంగా లేదా మోసపూరితంగా తమ గుర్తింపును, తమ మూలాలను తప్పుగా సూచించే వైద్య ఉత్పత్తులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2024 9:15 AM GMT
Public health alert, medicines, Falsified Medicines

ప్రజారోగ్య హెచ్చరిక: మీరు మందులు ఎక్కడ నుండి కొంటున్నారు.. ఎలాంటివి కొంటున్నారు? 

‘ఫాల్సిఫైడ్ మెడిసిన్స్’.. ఉద్దేశపూర్వకంగా లేదా మోసపూరితంగా తమ గుర్తింపును, తమ మూలాలను తప్పుగా సూచించే వైద్య ఉత్పత్తులు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 10.5 శాతం ఔషధాలు తప్పుడు లేదా నాణ్యత లేనివిగా ఉన్నాయని, దీని భారం తక్కువ, మధ్య-ఆదాయ దేశాలపై ఎక్కువగా పడుతుందని సంస్థ తెలిపింది.

అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ASSOCHAM) 2022లో, భారతదేశంలో దాదాపు 22 శాతం డ్రగ్స్ నకిలీవి, లేదా నాసిరకం అని 'Fake and Counterfeit Drugs In India – Booming Biz' అనే పేపర్‌లో వెల్లడించారు. డయాబెటీస్, బరువు తగ్గించే చికిత్సకు ఉపయోగించే మందులలో చాలా వరకూ నాసిరకమైనవి ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల వెల్లడించింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ప్రబలంగా ఉన్న వాటిపై మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. బలహీనమైన నియంత్రణ యంత్రాంగంతో, ఆర్థికంగా వెనుకబడిన వారు భారతదేశంలో ఇటువంటి మందుల ప్రతికూల ప్రభావాలకు గురవుతారు.

నకిలీ మందుల ముప్పు

నకిలీ, నాసిరకం మందులు భారతదేశంలో, అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరీ ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ఔషధాల వ్యాప్తి ప్రజారోగ్య సమస్యగా పరిగణిస్తున్నారు. "యాంటీమలేరియల్స్, జెనిటూరినరీ, సెక్స్ హార్మోన్లు ముఖ్యంగా ఒకదానికి బదులుగా మరో రకం మందుల వినియోగం ద్వారా ప్రభావితమవుతాయి. తక్కువ ధరకు లభించే నకిలీ మందుల వలన పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది” అని డాక్టర్ కిరణ్ మధాల్, తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ తెలిపారు.

భారతదేశంలో మొత్తం మార్కెట్ విలువ $14–17 బిలియన్ల (రూ. 14 లక్షల కోట్ల) ఉండగా.. $4.25 బిలియన్లు (రూ. 352 కోట్లు) నకిలీ మందులు ఉన్నాయని ASSOCHAM 2020లో అంచనా వేశారు. కలుషితమైన సిరప్‌లు, మందుల కారణంగా మరణాలు సంభవించడమే కాకుండా.. ఇతర వ్యాధులకు కూడా కారణమయ్యాయి.

తప్పుడు మందుల జాబితా:

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఏప్రిల్ 2024కి సంబంధించి ‘ప్రామాణిక నాణ్యత లేని’ ఔషధాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో Instgra టాబ్లెట్‌లు, Telmisartan 40 mg, Domperidone, Naproxen Sodium మాత్రలు, Rifaximin టాబ్లెట్‌లు ఉన్నాయి. సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరిస్టో ఫార్మాస్యూటికల్, టొరెంట్ ఫార్మా వంటి ప్రముఖ కంపెనీల కింద ఔషధాలకు తప్పుడు లేబుల్‌లు వేసినట్లు తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ) డిసెంబర్ 2023, జనవరి 2024లో నిర్వహించిన దాడులు.. ఇతర పరీక్షల్లో తేలింది.

DCA MPOD-200 మాత్రలు (Cefpodoxime Proxetil, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ టాబ్లెట్‌లు), MEXCLAV 625 టాబ్లెట్‌లు (అమోక్సిసిలిన్ మరియు పొటాషియం క్లావులనేట్, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ టాబ్లెట్‌లు), 'సెఫాక్సిమ్-CV టాబ్లెట్‌లు (సెఫాక్సిమ్-సివి మాత్రలు (సెఫ్‌పోడోక్సిమ్, పాక్టిక్ బాసిల్లస్ ప్రోక్సిటస్ సిఫ్‌పోడోక్సిమ్ టాబ్లెట్స్ ప్రోక్సాట్) ఉనికిలో లేని కంపెనీ తయారు చేసిన యాంటీబయాటిక్స్ అని కనుగొన్నారు.

అంతకుముందు జనవరి 2023లో, CDSCO వివిధ కారణాల వల్ల నిర్దిష్ట బ్యాచ్ నంబర్‌లతో 67 ఉత్పత్తులను జాబితా చేసింది. వీటిలో ml, pH, స్టెరిలిటీకి సంబంధించి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

ఫాల్సిఫైడ్ మందులలో ఏమి ఉంది?

తప్పుడు మందులు సాధారణంగా అసలైనవాటిని అనుకరిస్తాయి. అందులో క్రియాశీల పదార్ధాలు ఉండవు, ఒరిజినల్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ లేదా అత్యంత ప్రమాదకరమైన పదార్ధాలను కలిగి ఉండవచ్చు. "ల్యాబ్ పరీక్షల ప్రకారం, ఔషధాలలో బంగాళదుంప పిండి, మొక్కజొన్న పిండి, సుద్ద లాంటి పదార్థాలు కూడా ఉన్నట్లు కనుగొన్నారు" అని డాక్టర్ కిరణ్ చెప్పారు.

నకిలీ మందులను గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే అవి అసలైన ఉత్పత్తుల లాగే కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో, ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తారు. "స్వీయ-రోగనిర్ధారణ, స్వీయ-ప్రిస్క్రిప్షన్ సంస్కృతిని పెంపొందించడానికి వెబ్‌సైట్‌ల ఆవిర్భావానికి దారితీసింది, నాసిరకం, ఒకదానికి బదులు మరో తరహా మందులు తీసుకోడానికి కారణమవుతుంది" అని డాక్టర్ కిరణ్ చెప్పారు.

సెమాగ్లుటైడ్ ఉత్పత్తులపై WHO హెచ్చరిక:

WHO, ఇటీవలి ప్రకటనలో.. Ozempic బ్రాండ్ కోసం ఫేక్ సెమాగ్లుటైడ్ ఉత్పత్తుల విషయంలో హెచ్చరించింది. బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, USAలో టైప్ 2 మధుమేహం, బరువు తగ్గడం కోసం సూచించిన ఓజెంపిక్ బ్రాండ్ సెమాగ్లుటైడ్ కు సంబంధించిన మూడు బ్యాచ్‌ల గురించి WHO హెచ్చరించింది.

“Ozempic భారతదేశంలో వేరే పేరుతో అందుబాటులో ఉంది కానీ చాలా ఖరీదైనది. ఇది డయాబెటిక్ చికిత్సలో ప్రభావవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బరువు తగ్గడానికి అమెరికా కూడా ఆమోదించారు” అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. డయాబెటిక్ చికిత్స కోసం WHO సెమాగ్లుటైడ్‌ను సిఫారసు చేయదు, ఇది ప్రజారోగ్య విధానానికి తగనిదని తెలిపారు.

నాసిరకం, తప్పుడు, నకిలీ ఔషధాల ప్రతికూల ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు ఎంతో జాగ్రత్త వహించాలని.. సొంత వైద్యానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. నియంత్రణ లేని వెబ్‌సైట్‌ల నుండి మందులను కొనుగోలు చేయకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story