ఆహారం విషయంలో జాతీయ పోషకాహార సంస్థ సూచనలు
National Institute of Nutrition guidelines on food.దేశంలో కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. మనం భద్రంగా ఉంటామో జాతీయ పోషకాహార సంస్థ తెలియజేస్తుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 May 2021 4:42 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో దేనిని తాకాలన్నా భయం, అనుమానం తలెత్తుతున్నాయి. అలాగని వేటిని తాకకుండా, తినకుండా ఉండలేం. ఇక కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయాలు కొని తెచ్చుకుంటున్నప్పుడు ఒక్కొసారి చాలా భయం వేస్తుంటుంది. మన కూరగాయాలనే తెస్తున్నామా..? లేక కరోనా కూడా తెచ్చుకుంటున్నామా..? అన్న సందేహాలు కలగక మానదు. అయితే.. ఆహారం ద్వారా కరోనా వస్తున్న దాఖలాలు లేకపోవడంతో కాస్త ఉపశమనంగా ఉన్నా.. వాటిని తీసుకురావడంలో జరుగుతున్న పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
కూరగాయల అమ్ముతున్న వ్యక్తికి కరోనా ఉంటే.. ఇంటికి ఆహార ప్యాక్‌లను తీసుకువస్తున్న వ్యక్తికి కరోనా బారిన పడితే.. వాటిని తీసుకుంటున్న వారికి కరోనా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. మనం భద్రంగా ఉంటామో జాతీయ పోషకాహార సంస్థ తెలియజేస్తుంది.
ఎలా శుభ్రం చేయాలంటే..
- నల్లాద్వారా పారుతున్న నీటిలో కూరగాయలు, పండ్లు కడగాలి. శుభ్రంగా కడిగిన కూరగాయలను, పండ్లను ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
- క్రిమి సంహారక మందులు, శానిటైజర్లు నేరుగా కూరగాయల మీద చల్లకూడదు. అలా చేస్తే ఆరోగ్యానికి హాని తప్పదు.
- పాలు, పెరుగుల ప్యాకెట్లను శుభ్రంగా కడిగి.. వాటిని పొడి వస్త్రంతో తుడవాలి.
ఏవైనా కొనేటప్పుడు..
- తాజాగా ఉండే కూరగాయలు మాత్రమే కొనాలి. వాడిపోయినవి, దెబ్బతిన్నవి కొనకూడదు.
- మీరు తీసుకున్న కూరగాయలు మీ శరీరానికి, దుస్తులకు తగలకుండా జాగ్రత్తగా సంచిలో వేసి తీసుకురావాలి
- మీరు మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాక మీ చేతులు సబ్బుతో బాగా శుభ్రంగా చేసుకోవాలి. 40 నుంచి 60 సెకన్ల పాటు సబ్బుతో బాగా రుద్దుకోవాలి.
వండేటప్పుడు..
- కూరగాయలు కోసే కత్తులతో వాటినే కోయాలి. అన్నింటినీ తరగడానికి ఒకే కత్తి వాడకూడదు
- వేటికవే శుభ్రం చేయాలి. శాకాహారం, మాంసాహారం ఇలా అన్నీ శుభ్రం చేశాకే చేతులు కడుక్కుంటామనుకోవడం పొరపాటు
- కూరలు, పప్పులు ఫ్రిజ్‌లొంచి తీసి వెంటనే వేడి చేసుకోవాలి. సాధారంగా బయట కాస్త సమయం ఉంచి వేడి చేయాలనుకోవడం మంచిది కాదు.
- చేతి వేళ్లకు ఉన్న గోళ్లను ఎప్పటి కప్పుడు కత్తిరించుకోవాలి.