ముత్యాల గర్భం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ గర్భంలో పిండం ఉండదట?

Molar Pregnancy Information. సాధారణంగా గర్భం గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకుని ఉంటాము.కానీ ముత్యాల గర్భం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.ఈ గర్భంలో పిండం ఉండదట.

By Medi Samrat  Published on  1 Jan 2021 7:25 AM GMT
Molar Pregnancy Information

సాధారణంగా గర్భం గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకుని ఉంటాము. కానీ మీరు ఎప్పుడైనా ముత్యాల గర్భం గురించి విన్నారా? తెలియకపోతే కచ్చితంగా ఈ గర్భం గురించి తెలుసుకోవాల్సిందే. ముత్యాల గర్భం ధరించిన వారు సాధారణ గర్భవతులు లాగే వీరికి కూడా కడుపు పెరుగుతుంది. కానీ గర్భం లోపల బిడ్డ ఉండదు. వైద్యుని దగ్గర స్కానింగ్ వంటివి చేయించినపుడు లోపల ఉన్న బిడ్డ కనపడదు. ఈ ముత్యాల గర్భం ధరించిన వారు కడుపు ఎంతో పెద్దగా ఉంటుంది.అలా కడుపు పెద్దగా ఉండటం చూసి కవలలు ఉన్నారు అనే భ్రమలో ఉంటారు. అయితే ఈ ముత్యాల గర్భం ఎలా వస్తుంది? దానికి చికిత్స ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణ గర్భం ధరించిన వారి మాదిరే, ముత్యాల గర్భం ధరించిన వారికి కూడా గర్భవతుల లక్షణాలు అన్నీ ఉంటాయి. వాంతులు అవ్వడం, హార్మోన్ల అసమతుల్యత, నీరసంగా ఉండటం, అధిక రక్తపోటు ఇవన్నీ కూడా సాధారణ గర్భవతుల లక్షణాలను పోలి ఉంటుంది. కానీ గర్భంలో మాత్రం పిండం ఎదుగుదల ఉండదు. ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే..సాధారణంగా ఒక పిండం ఏర్పడాలంటే ఆరోగ్యకరమైన శుక్రకణం ఆరోగ్యకరమైన అండంతో కలిసి సంయోగం చెందినప్పుడు మాత్రమే పిండం ఏర్పడుతుంది.

ముత్యాల గర్భంలో మాత్రం ఆరోగ్యవంతమైన శుక్రకణం క్రోమోజోములు లేని ఒక ఖాళీ అండంతో సంయోగం చెంది శుక్రకణాలను రెట్టింపు చేసుకుంటుంది. దీనిలో మరో రకం కూడా ఉంది.శుక్రకణాలు ఒక కాలీ అండంతో సంయోగం చెందినప్పుడు ఆ అండంలో కేవలం మగ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. అండం తాలూకు క్రోమోజోములు ఉండవు అలాంటి గర్భాన్ని సంపూర్ణ ముత్యాల గర్భం అంటారు. ఈ గర్భం ఏర్పడినప్పుడు గర్భాశయంలో పిండం ఉండదు. కేవలం ముత్యాలు వంటి బుడగలు మాత్రమే ఏర్పడి ఉంటాయి.

Beta- HCG అనే హార్మోన్ సాధారణ గర్భంలో కనిపించే స్థాయి కన్నా మరింత ఎక్కువగా ఉంటుంది అప్పుడు డాక్టర్లు అది సాధారణ గర్భం కాదని, ముత్యాల గర్భం అని అంచనా వేస్తారు. ఈ విధంగా ముత్యాల గర్భం ఏర్పడినప్పుడు గర్భాశయం నుండి డైలాషన్ అండ్ క్యూరెట్టేజ్ (డి అండ్ సి) అనే ప్రక్రియ ద్వారా ఆ గర్భాన్ని తొలగిస్తారు.


Next Story