ఈ కొత్త వైరస్‌ సోకితే 8 రోజుల్లోనే మ‌ర‌ణిస్తారా?

Marburg virus outbreak in Ghana. కరోనా వైరస్‌ నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు మరో వైరస్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మంకీపాక్స్‌, కరోనా, ఎబోలాకు

By అంజి  Published on  22 July 2022 1:52 PM IST
ఈ కొత్త వైరస్‌ సోకితే 8 రోజుల్లోనే మ‌ర‌ణిస్తారా?

కరోనా వైరస్‌ నుంచి కోలుకోకముందే.. ఇప్పుడు మరో వైరస్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. మంకీపాక్స్‌, కరోనా, ఎబోలాకు తోడుగా ఇప్పుడు మార్‌బర్గ్‌ అనే మరో వైరస్‌ వచ్చి చేరింది. ఈ వైరస్‌ ఘనాలో బయటపడింది. మార్‌బర్గ్‌ సోకి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ వైరస్‌ ప్రపంచమంతా విస్తరించకముందే డబ్ల్యూహెచ్‌వో చర్యలు చేపట్టింది. మార్‌బర్గ్‌ సోకి మృతి చెందిన వారిని కాంటాక్ట్‌ అయిన 98 మందికి ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారు.

1967లో మార్‌బర్గ్‌ వైరస్‌ గుర్తింపు

ఎబోలా కుటుంబానికి చెందిన ఒక రకమైన హెమరేజిక్‌ ఫీవర్‌ వైరస్‌నే 'మార్‌బర్గ్‌' వైరస్‌ అంటారు. ఫారెస్ట్‌లో ఉండే రౌసెట్టూస్‌ అనే గబ్బిలాలలో ఈ వైరస్‌ ఎక్కువగా నివాసం ఉంటుంది. ఈ వైరస్‌ మనిషుల్లో కనిపించడం ఇదే ఫస్ట్‌టైమ్‌ కాదు. ఉగాండాలోని ఆఫ్రికన్‌ పచ్చని కోతుల ద్వారా ఈ వైరస్‌ మనుషులకు సోకిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. 1967లో మొదటిసారి జర్మనీలోని మార్‌బర్గ్‌ పట్టణంలో ఈ వైరస్‌ గుర్తించారు. దీని కారణంగానే ఈ వైరస్‌కు మార్‌బర్గ్‌ అని పేరు వచ్చింది. ఈ వైరస్‌ సోకితే మరణాల రేటు 24 నుంచి 88 శాతంగా ఉంటుంది.

మార్‌బర్గ్‌ ల‌క్ష‌ణాలు ఇవే

వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, స్రవాలను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

వైర‌స్ మ‌నిషి శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత 2 నుంచి రోజుల వ‌ర‌కు స‌జీవంగా ఉంటుంది.

వైర‌స్ సోకిన వారిలో అధిక జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పి, తిమ్మిర్లు, వాంతులు, విరోచ‌నాల వంటి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.

5 నుంచి 7 రోజుల మ‌ధ్య‌లో వాంతులు, మ‌లం ద్వారా ఎక్కువ‌గా ర‌క్త‌స్రావం అవుతుంది.

అధికంగా ర‌క్తాన్ని కోల్పోవ‌డం వ‌ల్ల 8 నుంచి 9 రోజుల్లోనే చ‌నిపోయే ప్ర‌మాదం ఉంది.

మార్‌బర్గ్‌ పట్ల నిర్లక్ష్యం వద్దు: డబ్ల్యూహెచ్‌వో

మార్‌బర్గ్‌ పట్ల నిర్లక్ష్యం వహించొద్దని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. నిర్లక్ష్యం వహిస్తే తక్కువ టైమ్‌లో చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ వైరస్‌ వ్యాపించకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేదు. ఫ్లూయిడ్స్‌ ద్వారా రోగి జీవించే అవకాశాలు మెరుగుపర్చవచ్చు.

Next Story