దగ్గు, జలుబుకు అద్భుతమైన వంటింటి చిట్కాలు..
Kitchen Tips for Cough and Cold. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.సీజనల్ వ్యాధులు దగ్గు, జలుబుదగ్గు, జలుబుకు అద్భుతమైన వంటింటి చిట్కాలు..
By Medi Samrat
వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంతేకాకుండా వర్షం కూడా పడటంతో ఎంతో మంది సీజనల్ వ్యాధులు దగ్గు, జ్వరం, జలుబు వంటి వాటితో సతమతమవుతున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కరోనా వచ్చిందేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ భయం ద్వారా ఆస్పత్రులకు వెళ్లి ఇంగ్లీష్ మందులను పెద్దమొత్తంలో వాడుతున్నారు.
ఈ విధంగా ఎక్కువగా ఇంగ్లీష్ మందులను వాడటం వల్ల ఆరోగ్యానికి మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సీజనల్ లో వచ్చే వ్యాధులను ఆసుపత్రికి వెళ్లకుండా కేవలం మన ఇంట్లో దొరికే మసాలా దినుసులు ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. అయితే దగ్గు, జలుబు, తలనొప్పి వంటి వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలను పాటించి చూడండి...
దాల్చినచెక్క- లవంగాల కషాయం:
మన ఇంట్లో ఉండే దాల్చినచెక్క లవంగాల కషాయం తొందరగా ఈ సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముందుగా ఒక గిన్నెలో రెండు దాల్చిన చెక్క, ఒక నాలుగు లవంగాలు, రెండు యాలకులు వేసి బాగా మరగనివ్వాలి. ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేడి అయిన తరువాత ఇందులో ఒక మూడు తులసి ఆకులను వేయాలి. ఈ కషాయం బాగా మరిగిన తర్వాత వడపోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని గోరువెచ్చని కషాయం తాగడం వల్ల దగ్గు జలుబు నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.
అల్లం కషాయం:
ముందుగా ఒక గిన్నెలో నీటిని మరిగించి అందులో అల్లం ముక్కను కొద్దిగా దంచి వేయాలి. అలాగే ఒక నాలుగు మిరియాలను, యాలకులు, రుచికోసం కొద్దిగా బెల్లం కూడా వేసి మరిగించాలి. ఈ విధంగా బాగా మరిగించిన తర్వాత ఈ కషాయంలోకి అవసరమైతే కొన్ని పాలను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారైన అల్లం కషాయం గోరువెచ్చగా తాగడం ద్వారా గొంతు నొప్పి, తలనొప్పి వంటి వాటి నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు.
మిరియాలు - నిమ్మరసం కషాయం:
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి వేడి చేయాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా,మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు కషాయం తాగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను సైతం కరిగిస్తుందని చెప్పవచ్చు.
ఈ విధంగా మన వంటింట్లో దొరికే మసాలాదినుసులు ద్వారా కషాయాలను తయారు చేసుకొని తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.