అల్ట్రా-ప్రాసెస్ ఫుడ్ తినే వారికి అలర్ట్.. పెరుగుతున్న గుండె సంబంధ సమస్యలు
భారతదేశంలోని ప్రజలలో ఊబకాయానికి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ప్రధాన కారణాలని తెలుస్తోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 July 2024 11:15 AM GMTఅల్ట్రా-ప్రాసెస్ ఫుడ్ తినే వారికి అలర్ట్.. పెరుగుతున్న గుండె సంబంధ సమస్యలు
భారతదేశంలోని ప్రజలలో ఊబకాయానికి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఇటువంటి ఆహార పదార్ధాలలో చక్కెర, ఉప్పు, కొవ్వు, కృత్రిమ రంగులు భారీగా ఉంటాయి. తక్కువ పోషక విలువలను కలిగి ఉండటంతో ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, టైప్ 2 మధుమేహం, వేగంగా వృద్ధాప్యానికి దారితీయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా జంక్ ఫుడ్‌లు అందుబాటులో ఉండడంతో అక్కడ కూడా ఎంతో వేగంగా ఊబకాయం ప్రబలుతూ ఉంది. వృత్తి, సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా జనాభాలోని అన్ని వర్గాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు ఊబకాయులుగా మారుతున్నారు.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఊబకాయానికి ప్రధాన కారణం:
ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆహార మార్గదర్శకాల ప్రకారం బ్రెడ్, వెన్న, పాలు ఆధారిత ఆరోగ్య పానీయాలు, వంట నూనెలను అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలుగా జాబితాలో చేర్చారు. అత్యంత సాధారణ అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో ప్యాక్ చేసిన కుకీలు, చక్కెర పానీయాలు, అల్పాహారం తృణధాన్యాలు, సిద్ధంగా ఉన్న భోజనం, శుద్ధి చేసిన పిండి, ఘనీభవించిన ఆహారాలు, చిప్స్, బిస్కెట్లు, మయోన్నైస్, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ఐస్ క్రీం, చీజ్, ఫ్రైలు, ప్యాక్ చేసిన స్నాక్స్ ఉన్నాయి. "అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఊబకాయానికి ప్రధాన కారణం. నిశ్చల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్ల ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ వల్ల ఊబకాయం పెరుగుతోంది” అని హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్స్‌లోని లీడ్ కన్సల్టెంట్, హెపాటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి అన్నారు.
భారత్‌లోకి అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌లు:
భారత్‌లోకి అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌లు రావడంతో.. సాధారణ ఔట్‌లెట్ల ద్వారా జరిగే ఆహార పదార్థాల విక్రయాల కారణంగా ఊబకాయం పెరగడంలో కీలక పాత్ర పోషించాయి. చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగం బాగా పెరిగింది. వీటిని తయారీ చేసే సమయంలో పిండిని అధికంగా శుద్ధి చేయడం, ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రతల్లో వండించడం లాంటివి చేసి హెల్తీ పదార్థాలను కూడా అనారోగ్య కారకాలుగా చేస్తున్నాయి.
"భారత మార్కెట్లలో కొవ్వులు, రెడ్ మీట్, ఫ్రక్టోజ్-రిచ్, ప్యాక్ చేసిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలను విక్రయించే తినుబండారాల మార్కెట్లతో ముడిపడి ఉన్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు ఇవన్నీ ఊబకాయం పెరగడానికి దోహదపడుతున్నాయి” అని డాక్టర్ కావ్య చెప్పారు.
అందుబాటులోకి వచ్చిన అల్ట్రా ప్రాసెస్ ఫుడ్:
కొన్నేళ్ల క్రితం వరకు మెట్రో, కాస్మోపాలిటన్ నగరాల్లో మాత్రమే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అందుబాటులో ఉండేవి. వేగవంతమైన పట్టణీకరణతో ఇటువంటి ఆహార పదార్థాలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరిపోయాయి. “గ్రామాల్లో కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. దిగువ, మధ్యతరగతి ప్రజలతో సహా ప్రతి ఒక్కరికీ అలాంటి ఆహారాలు అందుబాటులోకి వచ్చేశాయి. అవి చాలా తక్కువ ధరలో కూడా లభిస్తున్నాయి” అని హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ లీనత రెడ్డి జె చెప్పారు.
ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు:
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ వ్యాధుల ప్రమాదం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం 50% పెరుగుతుంది. క్యాన్సర్, జీర్ణశయాంతర, శ్వాసకోశ సమస్యలలో 32% పెరుగుదలను కూడా గుర్తించారు. "ఎక్కువ చక్కర ఉన్న పానీయాల వాడకం, మళ్లీ ఉపయోగించిన నూనెలలో వేయించిన పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో కూడిన అధిక శుద్ధి చేసిన నూనె, సామాజిక ఆహారపు అలవాట్లు.. ఇవన్నీ ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి" అని డాక్టర్ కావ్య చెప్పారు.
పోషణ నియంత్రణ లేదు:
ఊబకాయం పెరుగుదల పిల్లలలో కూడా ఎక్కువవుతోంది. సుమారు 12 మిలియన్ల మంది పిల్లలలో ఊబకాయం ఉన్నట్లు గుర్తించారు. పోషణ నియంత్రణ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ సమయం స్థూలకాయానికి ప్రాథమిక కారణాలుగా భావిస్తున్నారు. “ఇంతకుముందు, ఆహారం తినడానికి కోసం ఒక షెడ్యూల్ అంటూ ఉండేది. ఇప్పుడు ప్రజలు తమకు అనుకూలమైన సమయాల్లో ఆహారం తీసుకోవడంతో పరిస్థితి మారిపోయింది. ఒక సంవత్సరపు పిల్లవాడికి కూడా మొబైల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు ఇటువంటి పరిస్థితులు ఊబకాయాన్ని పెంచుతాయి" అని డాక్టర్ లీనత చెప్పారు.
అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.. కానీ చాలా తక్కువ అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఊబకాయం ఒక అంటువ్యాధిగా పరిగణించబడుతూ ఉండడంతో, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో చక్కెర, కొవ్వు, ఉప్పు స్థాయిని నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేబులింగ్, హెచ్చరికలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ లు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి.