ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎవరి చేతుల్లో చూసినా ఫోన్ కనిపిస్తోంది. తీరిక సమయం దొరికితే చాలు.. ఫోన్‌తో గడుపుతున్నారు. అయితే ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. దీనిపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజాగా స్పందించింది.
ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఫోన్లు వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా 1994 నుంచి 2022 మధ్య నిర్వహించిన 63 అధ్యయనాల ఫలితాలను విశ్లేషించి ఈ ప్రకటన చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మొబైల్ ఫోన్ వాడకం కారణంగా మెదడు క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల నమోదైనట్టు రుజువు కాలేదని తెలిపింది.
మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికీ ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర అంతర్జాతీయ ఆరోగ్య విభాగాలు గతంలోనే వెల్లడించాయి. తాజా ప్రకటన దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే, వీటిపై మరింత లోతైన అధ్యయనం అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.