భయపడుతున్న మంకీ ఫీవర్‌ లక్షణాలు ఇవే

కొన్ని రోజులుగా దేశంలో వెలుగు చూస్తున్న మంకీ ఫీవర్‌ కేసులు కలవరపెడుతున్నాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో ఈ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి.

By అంజి  Published on  13 Feb 2024 8:00 AM GMT
monkey fever, monkey fever symptoms, Health

భయపడుతున్న మంకీ ఫీవర్‌ లక్షణాలు ఇవే 

కొన్ని రోజులుగా దేశంలో వెలుగు చూస్తున్న మంకీ ఫీవర్‌ కేసులు కలవరపెడుతున్నాయి. కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో ఈ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 49 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసీజ్‌గా పిలుస్తున్న మంకీ ఫీవర్‌ తొలి కేసు జనవరి 16న నమోదైంది. అసలు మంకీ ఫీవర్‌ ఎలా వ్యాపిస్తుంది? లక్షణాలు ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

మంకీ ఫీవర్‌ ఎలా వస్తుంది?

ఇది వైరల్‌ డిసీజ్‌. ఇది క్యాసనూర్‌ ఫారెస్ట్‌ డిసీజ్‌ వైరస్‌ వల్ల వస్తుంది. కోతులను కుట్టిన కీటకాలు మనిషిని కుడితే మంకీ ఫీవర్‌ వస్తుంది. ఈ వైరస్‌ను మనదేశంలో మొదట 1957లో గుర్తించారు. పశ్చిమ కనుమలలో క్యాసనూర్‌ అటవీ ప్రాంతంలో బయటపడింది. తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయి. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది. ఫారెస్ట్‌ డిసీజ్‌ వైరస్‌ సోకిన కోతులను కుట్టిన కీటకాలు ఈ వ్యాధి వ్యాప్తికి వాహకాలుగా పని చేస్తున్నాయి.

మంకీ ఫీవర్‌ లక్షణాలు

వైరస్‌ సోకిన వారం తర్వాత నుంచి లక్షణాలు బయటపడతాయి.

మంకీ ఫీవర్‌ కారణంగా మొదట జ్వరం వస్తుంది. తర్వాత ఇది ఎక్కువ అవుతుంది.

జ్వరంతో పాటు దగ్గు, తలనొప్పి, విరేచనాలు, వాంతులు అవుతాయి.

మానసిక అనారోగ్యం, తీవ్రమైన వణుకు, దృష్టిలోపం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వైరస్‌ లక్షణాలు తీవ్రరూపం దాలిస్తే ఎక్కువ జ్వరం, విపరీతమైన తలనొప్పి, రక్తస్రావం కనిపిస్తాయి. ముక్కు రంధ్రాలపై భాగం నుంచి, గొంతు, చిగుళ్ల నుంచి రక్తస్రావం సంభవిస్తుంది.

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో 80 శాతం మంది రోలుగు ఎలాంటి లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారు. 20 శాతం మంది తీవ్రమైన రక్తస్రావ ఇతర సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇన్ఫెక్షన్‌ తీవ్రరూపం దాల్చిన వారిలో 3 నుంచి 5 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

మంకీ ఫీవర్‌ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ముందు చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సూచనలు పాటించాలి.

ELISA యాంటీబాడీ పరీక్షలు, ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.

వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది.

వ్యాధి లక్షణాలు కనిపించినవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.

అటవీ ప్రాంతంలో ఉండేవారు ఈగలు, కీటకాలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి.

ఈ వ్యాధి లక్షణాలు తీవ్రమైతే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Next Story