దూసుకొస్తున్న డెంగ్యూ దోమలు.. దాడిని అడ్డుకోండిలా..!
వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద తప్పదు. హైదరాబాద్ నగరంలో కూడా అందుకు అతీతం కాదు. దోమల వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 July 2023 6:37 AM GMTదూసుకొస్తున్న డెంగ్యూ దోమలు.. దాడిని అడ్డుకోండిలా..!
వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద తప్పదు. హైదరాబాద్ నగరంలో కూడా అందుకు అతీతం కాదు. దోమల వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించిన కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నప్పటికీ, గత సంవత్సరాలతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య నిపుణులు తెలిపారు. డెంగ్యూ దోమలు సాయంత్రం పూట కూడా కుడతాయి. డెంగ్యూ కారక దోమలు పగటిపూట మాత్రమే కుడతాయని మాత్రం నమ్మకండని అంటున్నారు. కొన్ని జాతుల దోమలు ఉదయం, సాయంత్రం కూడా దాడి చేస్తుంటాయి. రోగాలకు కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏడెస్ దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు.
“ఈ ఏడెస్ దోమలు ఎప్పుడైనా కుట్టవచ్చు, ముఖ్యంగా ఉదయం 6 నుండి 10 గంటల మధ్య, సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్య కుడుతూ ఉంటాయి. అవి చాలా అరుదుగా రాత్రిపూట కుట్టే ప్రమాదం ఉంది. మంచినీటిలో కూడా సంతానోత్పత్తి చేసే ఈ జాతి దోమలు పెద్దగా సౌండ్ చేయవు.. నిశ్శబ్దంగా కొరుకుతాయి. వాటి శరీరంపై చారల కారణంగా వాటిని టైగర్ దోమలు అని కూడా పిలుస్తారు” అని కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎస్ విజయ్ మోహన్ చెప్పారు. గత వారంలో నలుగురు డెంగ్యూ రోగులకు చికిత్స చేసిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పి సాకేతారెడ్డి మాట్లాడుతూ, “ఈ దోమల నుండి రక్షించుకోడానికి ఉత్తమ మార్గం ఇంట్లో ఉండడమే.. పరిసరాలలో నీటి నిల్వలను లేకుండా చేసి వాటి సంతానోత్పత్తిని నివారించాలి. నీరు నిలిచి ఉండే ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి. నిలిచిపోయిన నీరు దోమలకు ఆవాసాలుగా మారుతాయి. పిల్లలు, వృద్ధుల కోసం దోమ తెరలను ఉపయోగించాలి." అని చెప్పారు.
డెంగ్యూ లక్షణాలు, రకాలు
డాక్టర్ విజయ్ మోహన్ వివిధ రకాలైన డెంగ్యూ జ్వరాలను వివరించారు. “వీటిని డెంగ్యూ జ్వరం (DF), తీవ్రమైన రక్తస్రావ జ్వరం (DHF) గా వర్గీకరించవచ్చు, ఇవి ఎక్కువగా మెదడు లేదా ఉదరం నుండి రక్తస్రావానికి కారణమవుతాయి. అత్యంత ప్రమాదకరమైన డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DSS) కారణంగా లో బీపీ రావడమే కాకుండా.. అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది ఆ సమయంలో IV ద్రవాల అవసరం ఉంటుంది. డెంగ్యూ అనేది ఒక వైరస్, ఇది ఈడిస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు అధిక జ్వరం, శరీర భాగాల్లో తీవ్రమైన నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా వస్తాయి.. మనిషి బలహీనంగా మారిపోతాడు. జ్వరం సాధారణంగా మూడు నుండి నాలుగు రోజులపాటూ ఉంటుంది. జ్వరం లేని సమయంలో ప్లేట్‌లెట్స్ పడిపోవడం వంటి చాలా సమస్యలు సంభవిస్తాయి. దీన్ని ప్రమాదకరమైన కాలంగా పరిగణిస్తారు. కొంతమంది రోగులకు ప్లేట్‌లెట్స్‌లో తీవ్రమైన తగ్గుదల ఉంటుంది. లో-బీపీ ఉన్నప్పుడు, ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది." అని అన్నారు.
ప్లేట్‌లెట్ల అవసరం:
ప్లేట్‌లెట్ కౌంట్ సాధారణంగా మైక్రోలీటర్ రక్తంలో 1.5 నుండి 4.5 లక్షల మధ్య ఉంటుంది. ప్రతిరోజూ బోన్ మ్యారోలో మిలియన్లలో ఉత్పత్తి అవుతుంటాయి. గాయాలైనప్పుడు, రక్తస్రావం సమయంలో రక్తం గడ్డకట్టడానికి ప్లేట్ లెట్స్ చాలా అవసరం. వాటి జీవిత చక్రం సుమారు 10 నుండి 14 రోజులు ఉంటుంది. అవి ప్లీహములో చనిపోయే వరకు ప్రసరణలో ఉంటాయి. "అయినప్పటికీ, డెంగ్యూ వైరస్ ప్లేట్ లెట్స్ జీవిత చక్రం పూర్తికాకముందే అన్నిటినీ చంపుతుంది. బోన్ మ్యారో నష్టాన్ని భర్తీ చేయడానికి ఎక్కువ ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. వృద్ధులలో, పిల్లలలో, రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తులలో లేదా కొమొర్బిడిటీలు ఉన్నవారిలో బోన్ మ్యారో ప్రతిస్పందన తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో డెంగ్యూతో బాధపడుతున్నప్పుడు వారికి ప్లేట్‌లెట్ మార్పిడి అవసరం అవుతుంది, ”అని డాక్టర్ విజయ్ మోహన్ అన్నారు. "కానీ డెంగ్యూ వైరస్ సంఖ్య, శక్తిని బట్టి, కొత్తగా ఎక్కించిన ప్లేట్‌లెట్లు మళ్లీ నాశనం కావచ్చు. రక్తమార్పిడి చేసినప్పటికీ ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా పడిపోవచ్చు. ప్లేట్‌లెట్ కౌంట్ 20,000 కంటే తక్కువగా పడిపోతే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు" అని ఆయన వివరించారు.
కొత్త వైరస్ జాతులతో ప్రమాదమే:
ప్రజల ఆందోళనకు కారణం ఏమిటంటే.. డెంగ్యూ జ్వరం వైరస్ కొత్త జాతులలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం అధిపతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ కె శివ రాజు మాట్లాడుతూ “ప్రజలు సాధారణంగా అధిక జ్వరం, వెన్నునొప్పి, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో వస్తారు. కొందరికి ప్లేట్‌లెట్ మార్పిడి అవసరం కూడా ఉంటుంది. అయితే ఇటీవల కార్ఖానా ప్రాంతానికి చెందిన ఓ యువతికి దద్దుర్లు రావడం, కళ్ల నుంచి రక్తం కారడం, వాంతులు, వికారం.. ఆమెకు ఏమి ఇచ్చినా ఆ మందులు పని చేయకపోవడం వంటి లక్షణాలు వెలుగు చూశాయి. ఇటువంటి లక్షణాలు వైరస్ కొత్త జాతులే కారణమని సూచిస్తాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది." అని అన్నారు.
"ఇంకొన్ని సమస్యలను కూడా మేము గమనించాము. రక్తస్రావం కూడా వస్తుంటుంది. అధిక జ్వరం 48 గంటల్లో తగ్గకపోతే, సమస్యలను నివారించడానికి ఆలస్యం చేయకుండా డెంగ్యూ వైరస్‌ను గుర్తించడానికి తప్పనిసరిగా NS1 లేదా CBP రక్త పరీక్షలు చేయించుకోవాలని మేము రోగులకు సలహా ఇస్తున్నాము. వర్షాలు పెరిగేకొద్దీ ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కేసులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది, ”అని డాక్టర్ శివరాజు అన్నారు.
వెక్టర్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణకు GHMC తీసుకుంటున్న చర్యలు
పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతం, సికింద్రాబాద్‌లోని కార్ఖానా ప్రాంతంలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ ఎ రాంబాబు తెలిపారు. డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ దోమల సంతానోత్పత్తిని తగ్గించడానికి, అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. GHMCలో వెక్టర్ కంట్రోల్ ఆపరేషన్స్ (VCO) కోసం మొత్తం 2,375 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు.
“మేము నిర్మాణ స్థలాలు, పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, సెల్లార్లు, ఓపెన్ ప్లాట్లు, తాళం వేసిన ఇళ్లు వంటి ప్రాంతాల్లో రెండుసార్లు యాంటీ లార్వా ఆపరేషన్లు (ALO) నిర్వహిస్తున్నాము. మేము 4,846 కాలనీలను గుర్తించాము, డెంగ్యూ-గుర్తించిన అన్ని ప్రాంతాలలో రెగ్యులర్ యాంటీ లార్వా, యాంటీ-అడల్ట్ దోమల చర్యలు (ఫాగింగ్, IRS మరియు పైరెత్రమ్ స్పేస్ స్ప్రే) తీసుకుంటున్నాము. మా ఎంటమాలజీ విభాగం నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని చిన్న చెరువులు, సరస్సులు, ఇతర నీటి వనరులలో గంబూసియా చేపలను విడుదల చేస్తోంది. అన్ని మురికి నిలిచిపోయిన పాయింట్లు, చెరువులు, నాలాలు మొదలైన వాటిలో ఆయిల్ బాల్స్ విడుదల చేయడం, సరస్సులు, మూసీ నదిలో దోమల బెడదను తగ్గించడానికి, డ్రోన్‌ల నుండి స్ప్రే చేయడం ప్రారంభించాం ”అని డాక్టర్ రాంబాబు చెప్పారు. అందరికీ అవగాహన కల్పించడమే కాకుండా.. ఫీవర్ సర్వే చేయడమే కాకుండా.. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పారు.
- ఇల్లు, పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా నిరోధించడం ద్వారా దోమల ఉత్పత్తిని నివారించవచ్చు.
- ప్రతి కొన్ని రోజులకు, పూల కుండలు, కొబ్బరి చిప్పలు, వాటర్ కూలర్లు, ట్యాంకులు, టబ్‌లలో పేరుకుపోయిన నీటిని ఖాళీ చేయండి.
- నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి
- దోమల వ్యాప్తిని అడ్డుకునే వస్తువులను జాగ్రత్తగా వాడండి. అవసరమైతే పగటిపూట కూడా ఉపయోగించండి
- ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు దోమతెరలు వాడండి.
- పారాసెటమాల్‌లు తీసుకున్నా 48 గంటల్లో అధిక జ్వరం తగ్గకపోతే, ఆలస్యం చేయకుండా రక్త పరీక్షలు చేయించుకోండి.
- డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే, వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోండి, హైడ్రేటెడ్ గా ఉండండి, తేలికపాటి ఆహారాన్ని తినండి. తీవ్రంగా ఉంటే ఆసుపత్రిలో చేరండి. సాధారణంగా పక్షం రోజుల్లో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.