నీరే కదా అని ఎక్కువగా తాగకండి
Drinking too much or too little water is dangerous.మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు అంతే ముఖ్యం.
By తోట వంశీ కుమార్ Published on 20 Dec 2022 3:24 PM ISTమన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు అంతే ముఖ్యం. ఆహారం లేకుండా వారం పది రోజులు అయినా జీవించవచ్చు గానీ నీరు లేకుండా మాత్రం ఒకటి రెండు రోజులు కూడా ఉండలేము. రోజుకు రెండు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. దీంతో నీళ్లు ఎంత తాగితే అంత మంచిది అని అదే పనిగా కొందరు తాగేస్తుంటారు. అయితే.. మోతాదుకు మించి నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలా అని తక్కువ తాగడమూ ప్రమాదమే. మన శరీరానికి ఎంత నీరు అవసరమో అంతే తాగాలి.
ప్రమోజనాలు
సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతులంగా ఉంటుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలు వంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుంది. రక్తపోటు సైతం అదుపులోకి ఉంటుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అతిగా తాగితే..
అతిగా నీరు తాగడం వల్ల ఆ నీటిని వడబోసే శక్తి గానీ, నిల్వ ఉంచుకునే సామర్థ్యం గాని కిడ్నీలకు ఉండదు. అప్పుడు అధిక నీరు రక్తంలో కలిసిపోతుంది. శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. శరీరంలోని సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో హృదయ సమస్యలు వచ్చే అవకాశం అధికం అవుతుంది. తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు. అంతేకాకుండా అధిక మోతాదులో నీళ్లు తీసుకోవడం వల్ల మెదడు కూడా ప్రభావితం అవుతుంది. మూర్ఛ రావడం, లేదా కోమాలోకి వెళ్లడంలాంటివి కూడా జరగవచ్చు.
తక్కువగా నీటిని తాగితే..
శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రక్తం చిక్కబడుతుంది. కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడితే చర్మ సమస్యలు వస్తాయి. చర్మంపై మచ్చలు, ముడతలు రావడంతో పాటు అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. మలబద్దకం సమస్యలు వస్తాయి. ఎంజైమ్స్ యాక్టివ్‌గా పని చేయకపోవడం వల్ల తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీంతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే వయసు, చేసే పని, ఆరోగ్య పరిస్థితిని బట్టి కావలసినంత నీరు మాత్రమే తీసుకోవాలి.