ముక్కు నల్లబడి.. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చికున్‌గున్యా బారినపడినట్లే!
పూణే వంటి నగరాల్లో చికున్‌గున్యాకు సంబంధించిన కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కూడా ఇలాంటి కొన్ని కేసులు నమోదవుతూ ఉండడంతో అధికారులలో టెన్షన్ మొదలైంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2024 12:30 PM ISTముక్కు నల్లబడి.. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? చికున్‌గున్యా బారినపడినట్లే!
పూణే వంటి నగరాల్లో చికున్‌గున్యాకు సంబంధించిన కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. తెలంగాణలో కూడా ఇలాంటి కొన్ని కేసులు నమోదవుతూ ఉండడంతో అధికారులలో టెన్షన్ మొదలైంది. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, చర్మంపై దద్దుర్లు వంటివి చికున్‌గున్యా సాధారణ లక్షణాలు. ఈ సంకేతాలతో పాటు, కొత్త పరివర్తన చెందిన వైరస్ సోకిన రోగులకు ముఖం మీద హైపర్‌పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. ముక్కు చుట్టూ నల్లబడటం కూడా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతారని తెలిపారు. ముఖ్యంగా చికున్‌గున్యాతో బాధపడేవారిలో ఇటీవలి వరకు ఈ లక్షణం కనిపించేది కాదు.
ఫీవర్ ప్రొఫైలింగ్‌లో భాగంగా చికున్‌గున్యాను గుర్తించడానికి, డెంగ్యూ, మలేరియా ఇతర సంక్రమించే వ్యాధులను నివారించడానికి సమర్థవంతమైన దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా సెరాలజీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
కొత్త వేరియంట్ లో కనిపించే లక్షణాలు
భారతదేశంలోని అనేక నగరాల్లో ముఖ్యంగా పూణేలో చికున్‌గున్యా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,000 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. కీళ్ల నొప్పులతో సహా లక్షణాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి, అయితే ముఖం నల్లబడడం రోగులలో ఆందోళనను కలిగిస్తోంది. హైదరాబాద్ కింగ్ కోటిలోని కామినేని హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సోనాల్ జైన్ మాట్లాడుతూ “వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత ముఖంపై, ముఖ్యంగా ముక్కు దగ్గర చర్మం నల్లబడటం వంటి మూడు కేసులను మేము గత వారంలో చూశాము." అని తెలిపారు. బ్రౌనీ నోస్ సైన్ లేదా చిక్ సైన్ అని అంటారని తెలిపారు.
పిగ్మెంటేషన్ నుండి చర్మాన్ని రక్షించుకోండి:
స్కిన్ పిగ్మెంటేషన్ తీవ్రతరం కాకుండా ఉండటానికి, రోగులు తమ చర్మాన్ని కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎండలో తిరగకూడదని తెలిపారు.
“ఫోటోసెన్సిటివ్ చర్మం ఉన్నవారు తమ చర్మాన్ని పిగ్మెంటేషన్ సమస్యల నుండి రక్షించుకోవడానికి మాస్క్‌లు, స్కార్ఫ్‌లు, సన్‌స్క్రీన్ లేదా లాక్టోకాలమైన్‌ని ఉపయోగించవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లకు విరుగుడు లేనందున, రోగలక్షణ చికిత్సను అందించగలము. చికున్‌గున్యా కొత్త వేరియంట్ కారణంగా తక్కువ ప్రమాదం ఉంది" అని డాక్టర్ సోనాల్ వివరించారు.
రోగులకు పారాసెటమాల్‌తో చికిత్స అందిస్తారు. గుండె లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. నీటిని తాగడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండాలి.
సెరాలజీని నిర్ధారించాలి
రోగులు, ముఖ్యంగా మహిళలు దీర్ఘకాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ముక్కు చుట్టూ నల్లగా మారడం ఆందోళన కలిగించే అంశం. కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
"పోస్ట్-వైరల్ ఆర్థ్రాల్జియా మహిళల్లో తీవ్రంగా ఉంటుంది. 6 నెలల వరకు కొనసాగవచ్చు. ఇంత కాలం నొప్పి కొనసాగడానికి అసలు కారణం తెలియకుండానే వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అందువల్ల, కేసుల ప్రొఫైలింగ్‌తో పాటు కారణాన్ని గుర్తించడానికి సెరాలజీ పరీక్షలు చేయడం చాలా కీలకం”, అని డాక్టర్ సోనాల్ తెలిపారు.
దోమల నియంత్రణ తప్పనిసరి
డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాతో సహా సంక్రమించే వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి, నిపుణులు దోమల నియంత్రణ చర్యలను సూచిస్తున్నారు.
“కుండలు, బకెట్లలో నిలిచిపోయిన నీరు, నీటి నిల్వ ట్యాంకులను శుభ్రపరచడం, నీరు నిలిచిపోయే ప్రాంతాలలో సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉండేలా చూడడం, దోమల సంతానోత్పత్తి జరగకుండా చూడడం చాలా ముఖ్యం. చర్మంపై DEET లేదా పికారిడిన్ కలిగిన దోమల వికర్షకాలను ఉపయోగించవచ్చు. కిటికీలు, తలుపుల నుండి దోమలు రాకుండా తెరలు ఉపయోగించాలి. దోమలు ఇళ్లల్లోకి ప్రవేశించకుండా రసాయనాల ద్వారా నియంత్రణ చర్యలను చేపట్టవచ్చు” అని డాక్టర్ సోనాల్ తెలిపారు. చెరువులు, ఇతర నీటి వనరులలో దోమల పునరుత్పత్తి జరగకుండా చేయాలి. "నీటి స్తబ్దత, పర్యావరణ పరిశుభ్రతను పాటించడంపై సమాజంలో అవగాహన కల్పించాలి. దోమల రహిత పరిసరాలను సృష్టించడానికి సామూహిక ప్రయత్నాలు చాలా ముఖ్యం", డాక్టర్ సోనాల్ చెప్పారు.