మహిళా డాక్టర్లకు, సిబ్బందికి తగిన రక్షణ ఉందా?.. కలకలం రేపుతోన్న వైద్యురాలి హత్య

కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం జరిగింది.

By అంజి  Published on  14 Aug 2024 11:45 AM IST
Kolkata doctors rape murder, women doctors, RG Kar Medical College and Hospital

మహిళా డాక్టర్లకు, సిబ్బందికి తగిన రక్షణ ఉందా?.. కలకలం రేపుతోన్న వైద్యురాలి హత్య

కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం జరిగింది. అతి కిరాతకంగా ఆమెను హత్య చేయడం దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటన భారతదేశంలోని మహిళా డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్ల భద్రతపై చర్చకు దారితీసింది. కోల్‌కతాలో జరిగిన సంఘటన అక్కడ తగిన భద్రతా చర్యలు లేకపోడాన్ని ఎత్తిచూపాయి. ఈ దారుణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పని చేసే చోట్ల మహిళా మెడికోల భద్రతకు సంబంధించి అనేక ఆందోళనలను లేవనెత్తారు. “ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ పలు నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టింది. నల్ల బ్యాడ్జీలతో నిరసనలను కొనసాగిస్తున్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటన వైద్య సంస్థల్లో తగిన సౌకర్యాలు లేకపోవడాన్ని, లోపాలను బహిర్గతం చేసింది’’ అని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) సెక్రటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల అన్నారు.

నిధుల కొరత:

సంబంధిత ప్రభుత్వాలు తగినంత నిధులు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. "చాలా రాష్ట్రాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేదా అవుట్‌సోర్సింగ్ ద్వారా సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు వారు ఎలా బాధ్యత వహించగలరు? కాంట్రాక్టు ఏజెన్సీని డిబార్ చేయడం లేదా ఒక వ్యక్తిని బదిలీ చేయడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదు. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో 1 శాతం కంటే తక్కువ కేటాయింపులు ఉన్నప్పుడు మనం ఎలాంటి సహాయాన్ని ఆశించగలం, ”అని డాక్టర్ కిరణ్ అన్నారు. హెల్త్‌కేర్‌లో మహిళా శ్రామిక శక్తి శాతం 70 శాతానికి మించి పెరగడంతో, భద్రత పట్ల ఆందోళన కొనసాగుతూ ఉంది. భారతదేశంలో అనుబంధ సేవలలో అధిక శాతం నర్సులు, వైద్యులు, కార్మికులు మహిళలే ఉన్నారు.

నివేదికల ప్రకారం.. డాక్టర్లకు ప్రత్యేక విశ్రాంతి గదులు లేకపోవడంతో పనిలో చాలా కష్టపడిన తర్వాత సెమినార్ హాల్‌లో ఉండగా మహిళా డాక్టర్‌పై దాడి జరిగింది. దీంతో ప్రభుత్వరంగ సంస్థల్లో సౌకర్యాల లేమి బహిర్గతం అవుతోంది. “వైద్యులకు అన్ని స్పెషాలిటీలలో డ్యూటీ రూమ్‌లు అందించాలి. షేరింగ్ రూమ్‌లకు దూరంగా ఉండాలి. కొన్ని ఆసుపత్రుల్లో, మహిళా వైద్యులు మొబైల్ టార్చ్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉంటోంది. విశ్రాంతి గదులు చాలా తక్కువ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇది రాత్రి సమయాల్లో భద్రతకు ముప్పును పెంచుతుంది’’ అని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) అసోసియేట్ ప్రొఫెసర్, సభ్యురాలు డాక్టర్ ప్రతిభా లక్ష్మి అన్నారు. పర్మనెంట్ స్టాఫ్, సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో రక్షణ కరువైంది. ఇది మొదటి ఘటన కాదు.. వైద్యులు పని చేస్తున్న చోటే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో కూడా జరిగాయి.. రక్షణ లేకుండా పోతోంది.. చట్టాలను మరింత కఠినతరం చేయాలని డాక్టర్ ప్రతిభా లక్ష్మి అన్నారు.

జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసి) అనుమతులు మంజూరు చేస్తూ కోర్సుల సంఖ్యను పెంచుతూనే ఉన్నా, కీలకమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. లైంగిక వేధింపుల ఫిర్యాదులను దాచిపెడుతున్నారని, కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. “లైంగిక వేధింపుల ఘటనలు పెరిగినప్పుడు, ఆ విషయాన్ని దాచిపెట్టే అలవాటు ఆసుపత్రి పరిపాలనా యంత్రాంగానికి ఉంది. బాధితురాలి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెబుతూ మౌనంగా ఉండమని ఉన్నతాధికారులు ఒప్పిస్తూ ఉంటారు” అని DASE కార్యదర్శి డాక్టర్ AR శాంతి అన్నారు.

తమిళనాడులో డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ (DASE) లేవనెత్తిన మరో ఆందోళన ఏమిటంటే, కార్యాలయంలో మహిళల భద్రతకు భరోసా కల్పించడంలో విశాఖ కమిటీ సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయడం.

విశాఖ కమిటీ సిఫారసుల ప్రకారం మహిళా విద్యార్థులు, ఉద్యోగులు లేవనెత్తే ఫిర్యాదులను పరిష్కరించడానికి వైద్య సంస్థల్లోని అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ఐసీసీ) సమర్థవంతంగా లేవని అసోసియేషన్ పేర్కొంది.

“వైద్య సంస్థలలో లైంగిక వేధింపులు, ఇతర నేరాల నుండి భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం ICCని ఏర్పాటు చేసేలా చూడాలి. ఇప్పటికే ఉన్న చట్టాలను పాటించాలని ఆరోగ్య శాఖ తప్పనిసరిగా సంస్థలను ఆదేశించాలి’’ అని డాక్టర్ ఏఆర్ శాంతి అన్నారు.

తక్షణ కార్యాచరణ ప్రణాళిక అంటే ఏమిటి?

*మీ చుట్టుపక్కల ఎవరినీ నమ్మవద్దు .సహాయం కోరడంలో సంకోచించకండి

*సహోద్యోగుల మధ్య ఐక్యత నెలకొనాలి. ఒక సమూహంగా సమస్యలను పరిష్కరించుకోవాలి.

*ఆసుపత్రులు తప్పనిసరిగా ఉద్యోగుల మాదకద్రవ్యాల వ్యసనం, మద్యపానం, నేర చరిత్రను తనిఖీ చేయాలి.

హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు, శిశువైద్యురాలు డాక్టర్ ఎం కరుణ మాట్లాడుతూ, "అమ్మాయిలకు సకాలంలో భద్రతా పాఠాలు ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే విధుల్లో ట్రైనీ డాక్టర్లు కూడా తెలుసుకోవాలి." అని తెలిపారు.

Next Story