యువతికి అరుదైన పెల్విక్ కణితి.. సాంకేతిక నైపుణ్యంతో నయం చేసిన వైద్యులు
Amor doctors cured a rare pelvic tumor in the young woman's stomach with technical skill. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత
By అంజి Published on 1 Dec 2022 11:46 AM GMTహైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన అమోర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత అరుదైన పెల్విక్ కణితికి శస్త్రచికిత్స చేశారు. పెల్విస్‌లో కణితి ఏర్పడి, అది బాగా ఇబ్బంది పెడుతున్న 25 ఏళ్ల యువతికి అత్యంత సాంకేతిక నైపుణ్యంతో శస్త్రచికిత్స చేసి నయం చేశారు. ఆ వివరాలను ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కిశోర్ బి.రెడ్డి తెలిపారు.
''సుమారు 25 ఏళ్ల వయసున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మా ఆస్పత్రికి వచ్చారు. ఆమె తండ్రి కూడా ఒక వైద్యుడే. ఆమెకు అవసరమైన స్కాన్లు తీసిన తర్వాత, పెల్విస్‌లో కణితి ఉందని తెలిసింది. దాన్ని కాండ్రోబ్లాస్టోమా అంటారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి కణితి రావడం చాలా అరుదు. ఆమెకు కంప్యూటర్ నేవిగేషన్‌తో శస్త్రచికిత్స చేసి, ఆ కణితిని తొలగించాం. మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో ఈ శస్త్రచికిత్స చేశాం. దానివల్ల ఆమె మూడు రోజుల్లోనే లేచి నడవగలిగారు. సాధారణంగా పెల్విక్ కణితులకు శస్త్రచికిత్స చేసినప్పుడు కోలుకునేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో ఆమె చాలా త్వరగా కోలుకున్నారు.
ప్రధానంగా.. పెల్విస్‌కు సమీపంలోనే పేగులు, మూత్రకోశం లాంటి కీలకమైన అవయవాలుంటాయి. శస్త్రచికిత్స చేసేటప్పుడు వాటికి గాయమైతే ఆ తర్వాత మలమూత్ర విసర్జనకు సమయం ఎక్కువ పడుతుంది. కానీ కంప్యూటర్ నేవిగేషన్‌తో మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో అత్యంత సురక్షితంగా శస్త్రచికిత్స చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాతి రోజు నుంచే ఆమె జీవక్రియలన్నీ సాధారణంగా జరిగాయి. దాంతో మూడోరోజునే ఆమె లేచి నడవగలిగారు. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఒక కాంపోజిట్ మెష్ కూడా అమర్చడం వల్ల త్వరగా కోలుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నివారించడం సాధ్యమైంది.
పెల్విక్ కణితులు ఒక్కోసారి చాలా ప్రమాదకరంగా మారుతాయి. అవి కేన్సర్‌కు దారితీసి, మెటాస్టాసిస్ కూడా ఏర్పడుతుంది. (అంటే కేన్సర్ వేరే ప్రాంతానికి కూడా విస్తరిస్తుంది.) అందువల్ల ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇంటివద్దే నొప్పినివారణ మందులు వాడి ఊరుకోకుండా, వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎంత త్వరగా వీటిని శస్త్రచికిత్సతో తొలగిస్తే అంత మంచిది. ఈ కేసులో యువతి త్వరగా స్పందించి ఆస్పత్రికి రావడంతో వెంటనే శస్త్రచికిత్స చేయగలిగాం. అందువల్ల ఇలాంటి సమస్యలను తేలిగ్గా తీసుకోకూడదు'' అని డాక్టర్ అభిలాష్ వివరించారు. ఈ శస్త్రచికిత్సలో ఆర్థోపెడిక్స్, ఆర్థోపెడిక్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కిశోర్ బి.రెడ్డి నేతృత్వంలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ అభిలాష్, డాక్టర్ సంతోషిణి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ షేక్ మహ్మద్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.