అలోవెరా(కలబంద)తో ఎంతో మంచి ఆరోగ్యం.!
Aloe Vera Benefits. కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని 'వండర్ ప్లాంట్' అని పిలుస్తారు.
By Medi Samrat
కలబంద ఒక చిన్న కాండం కలిగిన పొద. దీనిని 'వండర్ ప్లాంట్' అని పిలుస్తారు. దీనిలో 500 జాతులు ఉండగా, వీటిలో ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి. అలోవెరా అతిముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటిస్ (మధుమేహం) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స గా పనిచేస్తాయి. కలబంద మీ చర్మ ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. అలోవెరా చాలా కాలం నుండి సౌందర్య సాధనాలు, మూలికా నివారణలు మరియు ఆహార పదార్ధాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
కలబందను మొటిమలు, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ (చర్మపు చారలు) తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. కలబంద వల్ల అలెర్జీలు రావడం చాలా అరుదు. అందుకే చాలా మంది చర్మ సమస్యల కోసం కలబందను సిఫార్సు చేస్తారు. కలబందలో చర్మాన్ని మృదువుగా చేసే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ప్రత్యేకించి మొటిమల కోసం వాడే చాలా మాయిశ్చరైజర్లలో దీన్ని కలుపుతారు. చుండ్రు సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా బాగా పనిచేస్తుంది.
కలబందలో ఉండే పెక్టిన్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును శుభ్రంగా మరియు మెత్తగా చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. అలొవెరా జెల్ ను మీ మాడుకు, జుట్టుకు బాగా పట్టించి, మర్దన చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డయాబెటిస్ చికిత్స కోసం కలబందను ఉపయోగించడం చాలా సులభం. మీరు రోజుకు రెండుసార్లు ఒక టీస్పూన్ కలబంద రసం తీసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.