ఈ భూమిని ప్రస్తుతం వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. మనుషుల మనుగడకే రాబోయే కాలాల్లో ఈ వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. భూమిపై ఈ వాయు కాలుష్యానికి కారణం మనుషులే అని చెప్పొచ్చు. అయితే ఈ వాయుకాలుష్యం కారణంగా అబార్షన్లు కూడా ఎక్కువవుతూ ఉన్నాయట..! భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. 2000–2016 మధ్య వాయు కాలుష్యం వల్ల ఏటా సగటున 3,49,681 అబార్షన్లు జరిగాయని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. ఏటా జరుగుతున్న అబార్షన్లలో వాయు కాలుష్యం వల్ల అవుతున్న అబార్షన్లు 7 శాతం చొప్పున పెరిగాయట..!

డబ్ల్యూహెచ్ వో నిర్దేశాల ప్రకారం కాలుష్యకారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. కానీ దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. 10 మైక్రోగ్రాములు దాటాక.. పెరిగే ప్రతి పాయింట్ కు 3 శాతం మేర అబార్షన్లు పెరుగుతున్నాయని నివేదికలో తేల్చేశారు. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో అబార్షన్లు జరిగిన 34,197 మంది మహిళల డేటా తీసుకుని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మన దేశంలోనే ఎక్కువగా 77 శాతం మేర వాయు కాలుష్యంతో గర్భ విచ్చిత్తులు జరిగాయని చెబుతున్నారు.. పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం మేర అబార్షన్లు అయ్యాయి. వాయి కాలుష్యం ఇలాగే పెరుగుతూ వెళితే రాబోయే రోజుల్లో పిల్లలు పుట్టడమే గగనమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


సామ్రాట్

Next Story