వర్షాకాలంలో జీర్ణ సమస్యలు.. ఈ ఐదు హెల్తీ డ్రింక్స్ నుండి ఉపశమనం పొందండి.!
వర్షాకాలంలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా విరేచనాలు, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీతో బాధపడుతుంటారు.
By Medi Samrat Published on 2 Aug 2024 10:07 AM GMTవర్షాకాలంలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా విరేచనాలు, ఉబ్బరం, గ్యాస్, అసిడిటీతో బాధపడుతుంటారు. ఒకటిరెండు చుక్కల వర్షం కురిసిన వెంటనే బయటి ఆహారం తినాలనిపించడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్య కూడా రావడం దీనికి ఒక కారణం. ఈ సీజన్‌లో ఇంట్లో కూడా వేపుడు పదార్థాలను ఎక్కువగా తింటాం. దీంతో జీర్ణక్రియపై చాలా ఒత్తిడి ఉంటుంది. దానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితితులలో వర్షాకాలంలో మంచి జీర్ణక్రియ కోసం.. మీరు కొన్ని గట్ హెల్తీ డ్రింక్స్ తాగాలి. తద్వారా ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
అల్లం టీ
అల్లం టీ ఉబ్బరం, అజీర్ణం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా అల్లం జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్ణం లేదా అసిడిటీ సమస్య ఉండదు. నీటిలో ఉడకబెట్టిన అల్లం రసం తాగడం మీ జీర్ణక్రియకు ప్రయోజనం చేకూర్చుతుంది.
సోంపు టీ
సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని చాలా మంది దీనిని భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా తింటారు. వీటిని తినడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. ఎందుకంటే ఫైబర్ కారణంగా ఆహారం సులభంగా ప్రేగుల గుండా వెళుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఇది కాకుండా వర్షాకాలంలో సంభవించే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీనిని టీ గా కూడా తీసుకోవచ్చు.
జీలకర్ర నీరు
జీలకర్రను నీళ్లలో వేసి ఉడకబెట్టి తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదనంగా ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్ర ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల ఉబ్బరం ఏర్పడదు. శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది, దీని కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
తులసి టీ
తులసి టీ జీర్ణక్రియకు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల మీ కడుపుకు ఉబ్బరం, గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది వర్షాకాలంలో సంభవించే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
పిప్పరమింట్ టీ
పిప్పరమింట్ టీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల కడుపు తిమ్మిరి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో కూడా సహాయపడుతుంది.