మూడు సార్లు పళ్ళు తోముకుంటే గుండెపోటు రాదు..!

By అంజి  Published on  3 Dec 2019 12:04 PM IST
మూడు సార్లు పళ్ళు తోముకుంటే గుండెపోటు రాదు..!

మీకు గుండెపోటు రాకుండా ఉండాలంటే ఒక చిన్న పని చేస్తే చాలు. రోజుకు మూడు సార్లు పళ్లు బ్రష్ చేసుకొండి చాలు. గుండెపోటు దూరంగా పరిగెడుతుంది. ఇదేదో తమాషా కాదండీ. దక్షిణ కొరియాలోని ఎహ్వా మహిళా యూనివర్సిటీ పరిశోధకులు 1,60,000 మందిపై పరిశోధనలు చేసి, తేల్చి చెప్పిన నిజం. రోజుకు రెండు సార్ల కన్నా ఎక్కువగా బ్రష్ చేసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశం పది శాతం తగ్గుతుందని ఈ పరిశోధనలు నిగ్గు తేల్చాయి.

క్రమం తప్పకుండా రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు పళ్లు తోముకోవడం వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. దీని వల్ల గుండె గదుల్లో గోడలు గట్టిపడటం (ఏట్రియల్ ఫైబ్రిలేషన్) జరగదని పరిశోధన తేల్చింది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయన్నదే పరిశోధనల సారాంశం. ఏట్రియల్ ఫైబ్రిలేషన్ తో బాధపడుతున్న 48 నుంచి 70 ఏళ్ల రోగులపై వైద్యులు పరిశోధనలు చేశారు. ఎక్కువసార్లు బ్రష్ చేసుకునేవారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందని, తద్వారా గుండె పోటు అవకాశాలూ తగ్గుతాయని వారు చెబుతున్నారు. ఇలా చేయని వారిలో 3 శాతం మందిలో ఫైబ్రిలేషన్ పెరిగింది. అయిదు శాతం మంది గుండె ఆగిపోయింది. ఈ వివరాలన్నిటినీ యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ అనే పరిశోధనా జర్నల్ లో ప్రచురించారు.

వీరు ముందుకు తెస్తున్న మరో వాదన ఏమిటంటే మూడు సార్లు పళ్లు తోముకోవడం వల్ల నోట్లో బాక్టీరియా తగ్గుతుంది. ఫలితంగా ఈ బాక్టీరియా నోటి ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలూ తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయని వారు చెబుతున్నారు. ఇలాంటి వారిలో ఫైబ్రిలేషన్ కూడా పన్నెండు శాతం వరకూ తగ్గుతుందని వారు అంటున్నారు.

ఈ పరిశోధనలకు కొన్ని పరిమితులున్నాయి. ఈ మాటను పరిశోధకులే అంగీకరిస్తున్నారు. అందుకే ఈ అంశం పై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

Next Story