నక్సల్స్ అప్డేట్ అయ్యారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 5:05 AM GMT
నక్సల్స్ అప్డేట్ అయ్యారా?

ముఖ్యాంశాలు

  • సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ వద్ద డ్రోన్ల కలకలం
  • జవాన్లకు షూట్ ఎట్ సైట్ ‘కనిపిస్తే కాల్చివేత' ఉత్తర్వులు
  • డ్రోన్ల కలకలంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆందోళన

మావోయిస్టులు అప్డేట్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు నాయకులను టార్గెట్ చేసేటప్పుడు రోడ్లపై మందుపాతరలు పేల్చడం, భద్రతా బలగాలను చుట్టుముట్టి తూటాల వర్షం కురిపించడం వంటి దాడులు చేస్తూ వస్తున్న మావోయిస్టులు ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు. భద్రత శిబిరాలపై నిఘా వేయడానికి మావోయిస్టు తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దించినట్టు సమాచారం వచ్చింది. నక్సల్స్ హింసలతో అట్టుడుకుతున్న ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో ముఖ్యమైన సీఆర్పీఎఫ్ క్యాంపు దగ్గర్లో డ్రోన్లు లేదా మానవ రహిత ఏరియల్ వెహికల్స్ ఎగురుతూ ఉండటాన్ని బలగాలు గమనించాయి. దీంతో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్​ అయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీ చేస్తున్న జవాన్లకు షూట్ ఎట్ సైట్ ‘కనిపిస్తే కాల్చివేత' ఉత్తర్వులు ఇచ్చాయి.

అధికారుల సమాచారం ప్రకారం.. ఎరుపు, తెలుపు లైటింగ్ విడుదల చేస్తున్న చిన్న డ్రోన్లు కిస్తారం, పల్లోడిలోని సీఆర్పీఎఫ్ క్యాంపుల వద్ద గత నెలలో కనిపించాయి. మూడు రోజుల్లో కనీసం నాలుగు సార్లు కనిపించాయి. ఆ డ్రోన్ల నుంచి చిన్నగా శబ్దాలు వస్తుండటంతో వాటిని బలగాలు గమనించి అప్రమత్తమయ్యాయి. నక్సల్స్​తో ప్రమాదం పొంచి ఉందంటూ దగ్గర్లోని అన్ని క్యాంపులకు అలర్ట్ పంపాయి. డ్రోన్లను టార్గెట్ చేసి, కాల్చేందుకు సైనికులు ప్రయత్నించినా.. వాటి జాడ కనపడలేదు. డ్రోన్ల కలకలంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నక్సల్స్ పట్టు ఎక్కువగా ఉండటం, ఆ రెండు క్యాంపుల వద్దకు కనీసం రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగ్గా లేకపోవడం, అక్కడ సాయుధ మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటంతో ఆందోళన చెందుతున్నాయి.

Naxals

ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ బోర్డర్​లో ఆ ప్రాంతాలు ఉండటంతో హెచ్చరికలు జారీచేశాయి. మావోయిస్టులు వాడుతున్న డ్రోన్లు బేసిక్​ వెర్షన్లని ఐబీ వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. వీటిని రిమోట్ ద్వారా కంట్రోల్​ చేస్తారని చెబుతున్నాయి. ఇవి పెళ్లిళ్లు, బహిరంగ సభలో వీడియోలు ఫోటోలు తీయడానికి ఉపయోగించే డ్రోన్స్ అయి ఉండవచ్చు అంటున్న అధికారులు వీటిని నక్సల్స్కు విక్రయించినట్లు భావిస్తున్న ముంబై వ్యాపారిని ఒకరిని విచారిస్తున్నారు.

Next Story