యూపీ: హత్రాస్‌ కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు

By సుభాష్  Published on  15 Oct 2020 10:13 AM GMT
యూపీ: హత్రాస్‌ కేసులో తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు

యూపీలోని హత్రాస్‌ ఘటనపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. సీజేఐ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. ‌హత్రాస్‌ బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. న్యాయ సహాయం విషయంలో ఇప్పటికే ప్రైవేటు న్యాయవాదులు బాధిత కుటుంబం తరపున ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసు విచారణ ఢిల్లీకి బదిలీ చేయాలని బాధితు కుటుంబం తరపున న్యాయవాది సీమా కుష్వాహ కోర్టును కోరారు. సీబీఐ స్టేటస్‌ రిపోర్టును ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి కాకుండా సుప్రీం కోర్టు సమర్పించేలా చూడాలని సీమా కుష్వాహ కోర్టుకు అభ్యర్తించారు.

అయితే స్టేటస్‌ రిపోర్టు నేరుగా కోర్టుకు సమర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని యూపీ సర్కార్‌ తెలిపింది. కాగా, ఈ కేసు విచారణ అలహాబాద్‌ హైకోర్టును చేయనివ్వలని సీజేఐ సూచించారు. మొత్తం మీద విచారఫై తమ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

కాగా, సెప్టెంబర్‌ 14న పొలం పనులు చేస్తున్న 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసేసి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు వరాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 29న కన్నుమూసింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా వారిని అనుమతించకుండా అదే రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు పోలీసులు దహనం చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన హత్రాస్‌ ఎస్పీతో పాటు ఐదుగురు పోలీసు అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది.

Next Story