వికారాబాద్ ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో కరోనా వైరస్‌ ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు కరోనా వైరస్‌ అనుమానితులను ఎవరిని కూడా అనంతగిరికి తీసుకురాలేదని సమాచారం.

హరిత రిసార్ట్స్‌లోని కరోనా ఐసోలేషన్‌ వార్డులను రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. వికారాబాద్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో జరుగుతున్న వ్యవహారాలను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు సమీక్షిస్తున్నారు. హరిత రిసార్ట్స్‌లోని కరోనా ఐసోలేషన్‌ వార్డులకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఇక అనంతగిరిలో పర్యాటకులు కనిపించడం లేదు.భక్తులు, పర్యాటకులతో కళకళలాడే అనంతగిరి పరిసర ప్రాంతాలు మూగబోయాయి. వికారాబాద్‌లోని సినిమా హాల్స్‌, ఫ్యాక్షన్‌ హాల్స్‌, మద్యం దుకాణాల పర్మిట్‌ రూమ్‌లు బంద్‌ అయ్యాయి. అనంతగిరికి వెళ్లాలంటే ఎన్నో అనుమానాలతో ప్రజలు భయపడుతున్నారు.

తాండూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా 20 పడకల ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. ప్రతి జిల్లాకు కరోనా సర్వేలైన్‌ అధికారిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డాక్టర్లు కట్టుకునే N95 మాస్క్‌ల కొరత ఏర్పడింది. కాగా హైదరాబాద్‌ నుంచి అనంతగిరికి హౌస్‌ కీపింగ్‌ స్టాఫ్‌ని అధికారులు తీసుకొచ్చారు.

అనంతగిరి టీబీ ఆస్పత్రిలోని ఆయా వార్డుల్లో బెడ్లు, మెడికల్‌కు సంబంధించిన కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా భయంతో ప్రజలు పెళ్లిళ్లకు కూడా హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లలో అంతంత మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. బస్సులలో, రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. హరిత రిసార్ట్స్‌లో ఉన్న ఐసోలేషన్‌ సెంటర్‌ను డబ్ల్యూహెచ్‌ఓ బృందం ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తోంది.

అనంతగిరిలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు వికారాబాద్‌ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారిని వికారాబాద్‌కు తీసుకురాకండి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వికారాబాద్‌ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.