హాజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌ కేసులో నేడు తుది తీర్పు.!

By అంజి  Published on  6 Feb 2020 4:20 AM GMT
హాజీపూర్‌ సీరియల్‌ మర్డర్స్‌ కేసులో నేడు తుది తీర్పు.!

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నల్గొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే విచారణ ముగియడంతో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఇవాళ శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. తాజాగా ఆదిలాబాద్‌ సమత హత్య కేసులో కోర్టు నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించడంతో.. ఈ కేసుపై కూడా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మైనర్ బాలికలు శ్రావణి, కల్పన, మనీషాలను నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి అత్యాచారం, హత్య చేసి మృతదేహాలను పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిపై భువనగిరి పోలీసులు మూడు చార్జ్‌ షీట్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్గొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఈ కేసులో 300 మంది సాక్షులను విచారించింది. పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈ కేసుకు సంబంధించి మూడు నెలల పాటు కొనసాగిన వాదనలు గత నెల జనవరి 17న పూర్తి అయ్యాయి. కాగా జనవరి 27 తుది తీర్పు వెలువడాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే.

నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి చేసిన నేరాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సీరియల్‌ హత్యల కేసులో ఫోరెన్సిక్‌ రిపోర్టు కీలకంగా మారనుంది. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి వీల్లేదని, శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాల అర్హుడని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఉరిశిక్ష విధించాలని బాధితులు, గ్రామస్తులు అంటున్నారు. కాగా వరుస హత్యల కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డి కోర్టు ఎలాంటి శిక్ష వేయబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది ఏప్రిల్‌ 25న హాజీపూర్‌ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడంలేదంటూ వచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019 ఏప్రిల్ 28వ తేదీన రాచకొండ పోలీసులు ఆధారాలతో సహా నిందితుడు శ్రీనివాస రెడ్డిని అరెస్ట్ చేశారు. ఓ స్కూల్ విద్యార్థిని మిస్సింగ్ కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్టుగా జరిగిన పాత అత్యాచారం హత్య కేసులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి.

Next Story
Share it